తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య పంచాయతీ సుప్రీంకోర్టులో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రభుత్వాలు పంపించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి చేస్తున్న ఆలస్యాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుల విషయంలో ఏదీ తేల్చకుండా మూడేళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌కు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న వేసింది. తమిళనాడు మాత్రమే కాకుండా పంజాబ్, కేరళ గవర్నర్లపైనా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవే రకమైన ఆరోపణలు చేస్తుండటంపైనా సుప్రీంకోర్టు స్పందించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల గవర్నర్ల వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన పలు బిల్లులపై సంతకం చేయడంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తీవ్ర ఆలస్యం చేస్తున్నారని.. స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2020 లో తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లుపై ఏ నిర్ణయాన్ని తేల్చకుండా 3 ఏళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉంచారని ప్రశ్నించింది. తెలంగాణ, పంజాబ్, కేరళ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని.. ఆయా రాష్ట్రాల సర్కార్లు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ల పని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
2020 లో తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లును 3 ఏళ్ల తర్వాత గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోద ముద్ర కోసం పంపించగా.. ఆయన వాటిని వెనక్కి పంపించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్టాలిన్ సర్కార్.. గవర్నర్ ఆర్ఎన్ రవి.. బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా విచారణ జరిగింది. ఈ క్రమంలోనే శనివారం మళ్లీ అసెంబ్లీని సమావేశపరిచిన డీఎంకే సర్కార్.. గవర్నర్ తిప్పి పంపిన 10 బిల్లుల్ని ఆమోదించింది. అనంతరం మళ్లీ వాటిని గవర్నర్‌కు పంపించింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. అసెంబ్లీ మళ్లీ బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపిందని గుర్తించి.. ఆయన ఏం చేస్తారో చూద్దాం అంటూ తదుపరి విచారణను డిసెంబరు 1 వ తేదీకి వాయిదా వేసింది. తమిళనాడు అసెంబ్లీ పంపించిన 181 బిల్లుల్లో 162 బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపినట్లు కోర్టు తెలిపింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గవర్నర్ అధికారాల గురించి ప్రస్తావనను తీసుకువచ్చింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు మూడు ఆప్షన్స్ ఉంటాయని పేర్కొంది. గవర్నర్ వద్దకు వచ్చిన బిల్లులకు ఆమోదం తెలపడం.. తిప్పి పంపించడం లేదా రాష్ట్రపతికి పంపడం జరుగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం గవర్నర్ పునఃపరిశీలన కోసం బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపవచ్చని కోర్టు చెప్పింది. గతంలో గవర్నర్ వద్దకు వచ్చిన చాలా రోజుల తర్వాత నీట్ మినహాయింపు బిల్లును వెనక్కి పంపించారని.. అసెంబ్లీ మళ్లీ బిల్లును ఆమోదించిన తర్వాత మాత్రమే దాన్ని రాష్ట్రపతికి పంపించారని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఆన్‌లైన్ గేమింగ్‌పై నిషేధం కోరుతూ వచ్చిన బిల్లుపైనా గవర్నర్ ఇదే వైఖరిని అవలంబించారని స్టాలిన్ సర్కార్ పేర్కొంది.