5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు హామీల జల్లు కురిపిస్తున్నాయి. రైతులు, వెనకబడినవారు, నిరుద్యోగులు, సామాన్యులు ఇలా అన్ని వర్గాల ఓట్లను తమకే పడేలా వివిధ రకాల పథకాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న పథకాలను మరింత పెంచి ఇస్తామని మేనిఫేస్టోల్లో ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని ప్రకటించిన బీజేపీ మరో కీలక ప్రకటన చేసింది.
సోమవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేలను రెట్టింపు చేసి.. ఏటా రూ.12 వేలు ఇస్తుందని తెలిపారు. దీంతోపాటు మరిన్ని హామీలను రాజస్థాన్ ఓటర్లపై ప్రధాని మోదీ గుప్పించారు. రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏం చేస్తామనే విషయాలను ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతులు పండించిన పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని.. దీనికి తోడు అదనంగా రైతులకు బోనస్ కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు. ఇక పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ప్రధాని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలపై సమీక్ష జరుపుతామని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.12, రూ.13 అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు.. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, పేదలను మోసం చేస్తోందని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాంటి వాళ్లను బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకు పంపుతుందని మోదీ హెచ్చరించారు. 200 నియోజకవర్గాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీలో.. 199 స్థానాలకు నవంబర్ 25 వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. అయితే ఆ మిగిలిన ఒక్క స్థానంలో బరిలో ఉన్న ఓ అభ్యర్థి ఇటీవల మరణించడంతో దానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే ప్రతీసారి రాజస్థాన్‌లో ప్రభుత్వాలు మారే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గెలుపుపై బీజేపీ ధీమాగా ఉండగ్.. ఆ సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.