విమానాల్లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికులు తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది పట్ల ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు జరగడం పట్ల విమాన ప్రయాణికులు, విమానయాన సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రయాణికుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు.. విమానంలోని ఎయిర్ హోస్టెస్ పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 6E556 విమానం రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు బయల్దేరింది. అయితే ఈ విమానంలో ప్రయాణిస్తున్న రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన రణధీర్ సింగ్ అనే 33 ఏళ్ల ప్రయాణికుడు వికృత ప్రవర్తనకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న రణధీర్ సింగ్.. ఇండిగో ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె చేతిని పట్టుకుని అనుచితంగా ప్రవర్తించాడని తోటి విమాన సిబ్బంది, ప్రయాణికులు తెలిపారు.
అయితే రణధీర్ సింగ్ ప్రవర్తనను విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది గమనించారు. అనంతరం ఆ వ్యక్తిని హెచ్చరించారు. వెంటనే ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఫ్లైట్ కెప్టెన్.. రణధీర్ సింగ్ ప్రవర్తనపై బెంగళూరు ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే ఎయిర్‌పోర్టు పోలీసులు వచ్చి రణధీర్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న నిందితుడు బెయిల్‌పై విడుదలైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందించిన ఇండిగో విమానయాన సంస్థ యాజమాన్యం.. మద్యం మత్తులో ఉన్న రణధీర్ సింగ్‌ను తోటి విమానయాన సిబ్బంది హెచ్చరించినా పదే పదే ఆ ఎయిర్ హోస్టెస్ చేయి పట్టుకుని అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డాడని పేర్కొంది. అయితే గత కొంత కాలంగా విమానాల్లో ఇలాంటి వికృత ప్రవర్తనలు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏ ప్రయాణికుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడోనని విమానయాన సంస్థలు, సిబ్బంది భయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ ఏడాది మొదట్లో కూడా చోటు చేసుకున్నాయి. జూన్ 24 వ తేదీన ముంబై-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు విమానంలోనే మల, మూత్ర విసర్జన చేయడం.. నేలపై ఉమ్మివేయడం వంటి చేయడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.