గత నెలన్నర రోజులుగా ఇజ్రాయేల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బందీల విడుదల విషయంలో ఇజ్రాయేల్, హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. కనీసం 50 మంది బందీలు, నిర్బంధంలో ఉన్న పాలస్తీనియన్ల విడుదలకు అంగీకరించినట్టు ఇరు వర్గాలు ఈ మేరకు ఓ ప్రకటన చేశాయి. భీకర దాడులతో వణికిపోతున్న గాజా వాసులకు ఈ ప్రకటన కాస్త ఉపశమనం కల్పించింది. అక్టోబర్ 7న హమాస్ కిడ్నాప్ చేసిన 50 మంది మహిళలు, పిల్లలను నాలుగు రోజుల సంధి సమయంలో విడుదల చేస్తారు.
ఖతార్ మధ్యవర్తిత్వ చర్చల అనంతరం ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అధ్యక్షతన మంగళవారం రాత్రి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంధి ఒప్పందాన్ని ఆమోదించారు. ఇది కష్టమైన నిర్ణయం, కానీ ఇది సరైన నిర్ణయం అని మంత్రులకు నెతన్యాహు చెప్పారు. అమెరికా అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఐదు వారాల అత్యంత కీలక చర్చలుగా అభివర్ణించిన ఆయన.. మంత్రివర్గం ఆమోదం చివరి అవరోధమని అన్నారు. అటు, హమాస్ సైతం మానవతా సంధిని స్వాగతిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇజ్రాయేల్ జైళ్ల నుంచి 150 మంది పాలస్తీనియన్లను కూడా విడుదల చేస్తుందని పేర్కొంది. ఆక్రమణదారులు (ఇజ్రాయేల్) గౌరవించినంత కాలం ప్రతిఘటన సంధికి కట్టుబడి ఉంటామని తెలిపింది. అక్టోబరు 7న హమాస్ దాడి.. ఇజ్రాయేల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. ఈ నరమేధంలో కనీసం 1,400 మంది ఇజ్రాయేలీలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దాదాపు 250 మందిని అపహరించి బందీలుగా చేసుకున్నారు.
ఈ మారణహోమానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయేల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. భూతల యుద్ధాన్ని ప్రారంభించి హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఆస్పత్రులు, పాఠశాలలు, శరణార్థ శిబిరాలపై ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేస్తున్న దాడులతో వేలాది మంది బలవుతున్నారు. ఇప్పటి వరకూ 14 వేల మంది పాలస్తీనా పౌరులు చనిపోగా.. వీరిలో అధిక శాతం చిన్నారులే కావడం అత్యంత బాధాకరం. తాజాగా, నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయేల్, హమాస్ మధ్య కుదిరిన ఒప్పందంలో అమెరికా, ఖతార్, ఈజిప్టు, దోహా కీలక పాత్ర పోషించాయి. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్, ఇజ్రాయేల్ విదేశీ నిఘా మొసాద్, ఈజిప్టు ఇంటెలిజెన్స్‌లు పాల్గొన్నాయి. గురువారం నుంచి బందీల విడుదల ప్రారంభం కానుండగా.. వీరిలో చిన్నారి అబిగైల్ మోర్ ఇడాన్‌తో సహా ముగ్గురు అమెరికన్లు ఉన్నారని అమెరికా సీనియర్ అధికారి తెలిపారు.
దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత బాధితుల్లో కొందరు తమ కుటుంబాలను తిరిగి కలుస్తారని, ఇంది తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించింది, ‘బందీలకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో నిర్బంధించిన అనేక మంది పాలస్తీనా మహిళలు, పిల్లలు విడుదలవుతారు.. ప్రక్రియ వివరాలు వచ్చే 24 గంటల్లో ప్రకటించనున్నారు.. ఒప్పందానికి లోబడి నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa