కేరళలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన మ్యూజిక్ ఫెస్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 60 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 15 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోచి నగర శివార్లలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో శనివారం (నవంబర్ 25) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా ఆహ్లాదంగా ఉన్న యూనివర్సిటీ క్యాంపస్.. బాధితుల ఆర్తనాదాలు, అంబులెన్స్‌ల సైరన్లతో ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది.
యూనివర్సిటీలో కొన్ని రోజులుగా టెక్ ఫెస్ట్ జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం మ్యూజిక్ ఫెస్ట్ ఏర్పాటు చేశారు. ప్లేబాక్ సింగర్ నిఖితా గాంధీ పాల్గొన్న ఈ మ్యూజిక్ ఫెస్ట్ ప్రాంగణం.. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థినీ విద్యార్థులలో కిక్కిరిసిపోయింది. బహిరంగ ప్రదేశంలో నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ ఫెస్ట్ ప్రారంభమైన కాసేపటికి అకస్మాత్తుగా వర్షం మొదలైంది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆడిటోరియంలో వైపు పరుగెత్తారు. ఈ క్రమంలో ఏం జరిగిందో, ఏమో గానీ.. తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కిందపడిన విద్యార్థులను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు యువకులు మృతి చెందారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గాయపడిన వారిని కాలమాసెరీలోని ఎర్నాకుళం మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంత మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.