రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. అయితే ఈ నెల ప్రారంభంలో ‘సంకల్ప్ పత్ర’ పేరిట బీజేపీ విడుదల చేసిన 75 పేజీల ఎన్నికల ప్రణాళికను లోతుగా పరిశీలిస్తే ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలగకమానదు. రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి, అధికారాన్ని కైవసం చేసుకోవాలని కమలదళం శతవిధాలా ప్రయత్నించింది. అది ఫలిస్తుందా లేదా అన్నది డిసెంబర్ 3న తేలుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో ఓ హెచ్చరిక చేసింది.
తనను గెలిపిస్తే ‘భారత్ వ్యతిరేక శక్తుల’కు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ విభాగాన్నే ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. దీనిని హామీగా కాకుండా హెచ్చరికగానే చూడాల్సి ఉంటుంది. రాజస్థాన్ గత చరిత్రను ఓసారి అవలోకనం చేసుకుంటే దానికి దీర్ఘకాలిక ఫ్యూడల్ చరిత్ర ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్న అంశాల్లో మానవ హక్కుల పరిరక్షణ కూడా ఉంది. 2013-2018 మధ్యకాలంలో రాజస్థాన్ బీజేపీ ఏలుబడిలోనే ఉంది. గో రక్షకుల పేరిట హిందూత్వ శక్తులు పెట్రేగిపోయి దాడులకు తెగబడ్డ ఉదంతాలు అనేకం వెలుగు చూశాయి. విచారణ సంస్థలు సహా రాష్ట్ర ప్రభుత్వ యంత్రంగం ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తుల్ని నీరుకార్చింది. ఆ సమయంలో వసుంధర రాజె రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు యధేచ్ఛగా సాగాయి. మత ఘర్షణలను ఆపడం పేరుతో బుల్‌డోజర్లు పంపి 750 మంది ముస్లిం ప్రజల నివాస గృహాలను కూల్చేశారు. ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని గో రక్షకులు దాడులు చేశారు.
రాష్ట్రంలో మియో ముస్లింలు ప్రధానంగా పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. రాజస్థాన్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో వీరు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. భారీ పరిశ్రమలు లేకపోవడం, ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలు లభించకపోవడం వంటి కారణాలతో మియో ముస్లింలకు డెయిరీలపై ఆధారపడడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గో రక్షకుల దాడుల నుండి రక్షణ కల్పించేలా రెండు బిల్లులు రాజస్థాన్ మూకదాడుల నుంచి రక్షణ బిల్లు, స్వేచ్ఛగా మతాంతర వివాహాలు చేసుకునే బిల్లు తీసుకొచ్చింది. అయితే వీటికి కేంద్ర హోం శాఖ మోకాలడ్డింది. ఫలితంగా ఇప్పటి వరకూ రాష్ట్రపతి ఆమోదం లభించలేదు.మియో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న తిజారా నియోజకవర్గంలో బీజేపీ వ్యూహాత్మకంగా ఫైర్‌బ్రాండ్ హిందూత్వ నేత, అల్వార్ ఎంపీ బాలక్ నాథ్‌ను బరిలో దింపింది. తిజారాలో ఎన్నికల పోరు అంటే భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ వంటిదని బాలక్ తన ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పుకొచ్చారు. బాలక్ నాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో బీజేపీకే చెందిన మరో నేత సందీప్ దేమా మాట్లాడుతూ గురుద్వారాలు, మదర్సాలను కూల్చివేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. సిక్కు సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో సందీప్‌ను పార్టీ నుండి బీజేపీ బహిష్కరించింది. తన వ్యాఖ్యలపై ఆ తర్వాత ఆయన వివరణ ఇస్తూ మసీదులు, మదర్సాలు అనబోయి గురుద్వారాలు అన్నానని చెప్పారు.
ఈ ఉదంతాలన్నీ బీజేపీ కరడుకట్టిన హిందూత్వ వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ నేతలు మొసలి కన్నీరు కార్చారు. అయితే వారి మాటలకు, చేతలకు మధ్య ఎంతో తేడా ఉంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో గిరిజన ఉప ప్రాంత (టీఎస్పీ) ప్రణాళికలో 72.85%, ఎస్సీ-ఎస్టీ ప్రాంతంలో 76.63% మాత్రమే ఖర్చు చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ పనితీరు మెరుగ్గా ఉంది. ఆ పార్టీ టీఎస్పీలో 90.70%, ఎస్సీ-ఎస్టీ ప్రాంతంలో 89.74% ఖర్చు చేసింది. అంతేకాక ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అసెంబ్లీలో కొన్ని బిల్లులు కూడా ఆమోదించింది.