ఙ్ఞానసముపార్జనకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడో వృద్ధుడు. రిటైర్ కావాల్సిన 65 ఏళ్ల వయసులో ఆయన 1వ తరగతిలో చేరాడు. మునిమనవల వయసున్న చిన్నారుల మధ్య కూర్చుని అక్షరాలు నేర్వడం ప్రారంభించాడు. ఈ అసాధారణ ఘటన పాక్‌లో వెలుగు చూసింది. ఖైబర్ పాఖ్‌తున్ఖ్వా ప్రావిన్స్‌కు చెందిన దిలావర్ ఖాన్ ఇటీవల స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరాడు. జీవిత చరమాంకంలో ఓ కొత్త ప్రయాణం ప్రారంభించాడు.
చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు భుజాన పడటంతో దిలావర్ చదువుకు దూరమయ్యాడు. సంసార సాగరం ఈదుతూ జీవితమంతా నిరక్షరాస్యుడిగా గడిపేశాడు. అయితే, చదువుకు వయసుతో సంబంధం లేదని బలంగా నమ్మే దిలావర్, మలివయసులో తనకు దొరికిన తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మళ్లీ చదువుపై దృష్టి పెట్టాడు. తన నిర్ణయం సమాజం విధించిన పద్ధతులు, కట్టుబాట్లకు ఓ సవాలని వ్యాఖ్యానించాడు. తన జీవన కథను తానే తిరగరాసేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన దిలావర్ ఖాన్‌ను స్థానిక పాఠశాల ఘనంగా స్వాగతించింది. దిలావర్ నిర్ణయం సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుందని, చదువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజెప్పిందని స్కూల్ యాజమాన్యం వ్యాఖ్యానించింది.