యాగాలు, యజ్ఞాల పేరు చేప్పగానే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తొస్తారు. ఎన్నికల్లో విజయం కోసం ఇటీవల కూడా కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం నిర్వహించారు. కేసీఆర్ చేస్తున్న యాగాల వల్ల మిగతా రాజకీయ నాయకుల్లోనూ వీటి పట్ల ఆసక్తి పెరిగింది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ్యాధికారాన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తూ.. పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టాలని ఆకాంక్షింస్తూ.. రాజశ్యామల యాగం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ సతీసమేతంగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. విశ్వశాంతి, లోకకళ్యాణం కోసం... పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టడం కోసం శతకుండాత్మక మహారుద్ర, శత సహస్ర మహా చండీ సహిత రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నట్లు బత్తుల రామకృష్ణ తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలోని గాధరాడలోని ఓం శివశక్తి పీఠంలో ఈ యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగశాలకు శతఘ్ని యాగశాల అని పేరు పెట్టారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 300 మంది రుత్వికులు ఈ యాగాన్ని చేస్తున్నారు.
జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సభ్యుడు కందుల దుర్గేష్, పిఠాపురం ఇంఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ఈ యాగశాలను సందర్శించారు. ఈ సందర్భంగా యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా వేదిక వద్ద చిన్నారుల నృత్య ప్రదర్శన తిలకించారు. రాజశ్యామల యాగం చేస్తున్న బత్తుల బలరామకృష్ణ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్, ఇందిరా గాంధీ ఈ యాగాన్ని చేపట్టారన్నారు. విశ్వశాంతి కోసం యాగం చేపట్టాలని తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్నానని అది ఇప్పటికి కుదిరిందన్నారు. సోమవారం కార్తీక పౌర్ణమి రోజున పూర్ణాహుతి జరుగుతుందన్నారు.