ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబయిలో పాక్ ముష్కరుల నెత్తుటి క్రీడకు 15 ఏళ్లు.. ఇజ్రాయేల్ సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sun, Nov 26, 2023, 10:08 PM

సరిగ్గా పదిహేనేళ్ల కిందట నవంబరు 26న దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలోకి పాకిస్థాన్ తీవ్రవాదులు చొరబడి సృష్టించిన మారణహోమం యావత్తు దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ముష్కర దాడుల్లో అత్యంత ఘోరమైన ఘటనగా ప్రపంచ చరిత్రలో ఇది నిలిచిపోయింది. 2008 నవంబరు 26న 10 మంది పాక్ ఉగ్రవాదులు ముంబయిలోకి ప్రవేశించి.. మూడు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు నరమేధానికి తెగబడ్డారు. బాధితులను ఈ చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తమ కుటుంబ సభ్యుల్ని తలచుకొని బాధపడుతున్నారు.


పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, మరో తొమ్మిది ముంబయిలోకి చొరబడి.. ఒబెరాయ్ హోటల్, తాజ్, నారీమన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లోకి ప్రవేశించారు. దాడి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ముందుగానే ఈ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి.. దాడులకు వ్యూహరచన చేశారు. అక్కడ హోటల్స్‌లో ఉన్న దేశ, విదేశీయులను బంధీలుగా చేసుకొని రెచ్చిపోయారు. లోపలి నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగా సమయం పట్టింది.


పది మంది ముష్కరుల్లో 9 మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ కసబ్‌ను తర్వాత ఉరి తీశారు. ఈ భయానక దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. ఈ దాడి పేరుచెబితే ముంబయి మహానగరం ఉలిక్కిపడుతుంది. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే వీరోచితగా పోరాడి అమరుడయ్యారు. నాటి ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్ కసబ్‌ను విచారించి, మరణశిక్ష విధించారు. నాలుగేళ్ల తర్వాత 2012 నవంబరులో కసబ్‌ను ఎరవాడ జైలులో ఉరి తీశారు. ముంబయిలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్థాన్‌లోనే జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలను భారత్ బయటపెట్టింది. పాక్ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మహ్మాద్ అలీ దురానీ కూడా దీనిని ధ్రువీకరించారు. కానీ దాయాది మాత్రం తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికీ కప్పిపుచ్చుకుంటోంది.


ఇక, విషాదకరమైన ఉగ్రదాడులకు 15 ఏళ్లు పూర్తికాగా.. ఇజ్రాయేల్ అధికారికంగా లష్కరే తోయిబా (ఎల్‌ఇటి)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. భారత ప్రభుత్వం ఎలాంటి అభ్యర్థన లేకుండానే ఈ చర్య తీసుకోవడం గమనార్హం. లష్కరే తొయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడానికి అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక అభ్యర్థన లేకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయేల్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.


‘ఐరాస భద్రతా మండలి లేదా అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ద్వారా గుర్తించి, ఇజ్రాయేల్ తన సరిహద్దుల లోపల లేదా చుట్టుపక్కల లేదా భారతదేశం తరహాలో చురుకుగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలను మాత్రమే జాబితా చేస్తుంది. ఇజ్రాయేల్ రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రులు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ ఉమ్మడి పోరాటం ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ తేదీన లష్కరే తొయిబా సంస్థను వేగవంతమైన, అసాధారణమైన జాబితా కోసం గత కొన్ని నెలలుగా సంయుక్తంగా పనిచేశాం’ అని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa