కోవిడ్-19 మొదటి, రెండో వేవ్ సమయంలో మరణించిన వైద్యుల కుటుంబాలలో 29 శాతం మందికి మాత్రమే ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం అందించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఈ విషయం వెల్లడైంది. మహమ్మారి సమయంలో మరణించిన మొత్తం వైద్యుల సంఖ్యపై తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వైద్యుల మరణాల సంఖ్య 1,500కి పైగా ఉన్నదని తెలిపింది.
ఆర్టీఐ సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 475 వైద్యుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) కింద కోవిడ్-19 సంక్రమణ ప్రమాదంలో ఉన్న కమ్యూనిటీ, ప్రయివేటు ఆరోగ్య కార్యకర్తలతో సహా ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ప్రభుత్వం రూ. 50 లక్షల బీమా కవరేజీని ప్రకటించింది.
అక్టోబర్ 23న దాఖలు చేసిన ఆర్టీఐలో కన్నూర్‌కు చెందిన నేత్ర వైద్య నిపుణుడు కె.వి.బాబు ఈ పథకం కింద పరిహారం పొందిన మొత్తం లబ్ధిదారుల సంఖ్యపై సమాచారాన్ని కోరారు. అంతకుముందు మహమ్మారి సమయంలో కోవిడ్ యోధులుగా పిలువబడిన వైద్యుల సంఖ్యను సైతం ఆయన అడిగారు.
పరిహారం పొందిన మొత్తం ఆరోగ్య కార్యకర్తల సంఖ్య, మహమ్మారి సమయంలో మరణించిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై రాష్ట్రాల వారీ డేటాను కూడా ఆయన కోరారు.
ఈనెల 21న ఆర్టీఐ ఇచ్చిన సమాధానం ప్రకారం.. 2,244 కుటుంబాలకు రూ.1122 కోట్లు, 475 వైద్యుల కుటుంబాలకు రూ. 237.5 కోట్లు, 1,769 ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు రూ. 884.5 కోట్లు పరిహారంగా అందాయి. ఆర్టీఐ కార్యకర్త మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణ నిపుణులకు చేసిన మొత్తం పరిహారంలో పరిహారం పొందిన వైద్యుల శాతం 21.16 శాతం మాత్రమే అని అన్నారు.
3.5 లక్షల మంది వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎంఏ మహమ్మారి సమయంలో విధులు నిర్వహిస్తూ మరణించిన వైద్యుల వివరాల జాబితాను రాష్ట్రాల వారీగా సిద్ధం చేసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో మరణించిన 757 మంది వైద్యులలో 90 మంది తమిళనాడుకు చెందినవారు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ (80), మహారాష్ట్ర (74), ఆంధ్రప్రదేశ్ (70), కర్ణాటక (68), ఉత్తరప్రదేశ్ (66), గుజరాత్ (62), బీహార్ (40)లు ఉన్నాయి.
రెండో వేవ్‌లో అత్యధిక మరణాలు ఢిల్లీ నుంచి నమోదయ్యాయి. 839 మంది వైద్యుల మరణాల్లో 128 మంది ఢిల్లీ నుంచే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్ (115), ఉత్తరప్రదేశ్ (79), పశ్చిమ బెంగాల్ (65), తమిళనాడు (64), ఆంధ్రప్రదేశ్ (48), ఒడిశా (46), తెలంగాణ (43), గుజరాత్ (30), జార్ఖండ్ (30)లు ఉన్నాయి.