హత్య, కిడ్నాప్, అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన నేరాల్లో శిక్షపడి జైలుశిక్ష అనుభవిస్తూ తీవ్ర అస్వస్థత గురై, అత్యవసర చికిత్స అవసరమైన సమయంలో వారిని బయట ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీలకు తరలించి చికిత్స చేయించే విషయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని రూపొందించాలని జైళ్లశాఖ ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి తీవ్రమైన నేరాల్లో ఎంతమంది జైలుశిక్ష అనుభవిస్తున్నారు? వీరిలో ఎంతమంది అనారోగ్య కారణాలతో జైలు నుంచి విడుదలయ్యారు? తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఇందుకు సమయం ఇస్తూ విచారణను డిసెంబరు 5కి వాయిదా వేసింది.
ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ తూటా చంద్రధనశేఖర్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. బాపట్లకు చెందిన శ్రీనివాసవర్మకు గుంటూరు పోక్సో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ 2022 డిసెంబరులో తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం అతను రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు.పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో అప్పీల్ చేశారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నందున ఆరు నెలలపాటు మధ్యంతర బెయిల్ కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ జి.నరేందర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ వర్మను అత్యవసర చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించాలని ఆదేశించింది. జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అత్యవసర చికిత్స అందించే విషయంలో ఉన్న నిబంధనలపై జైళ్లశాఖ అధికారులను వివరణ కోరింది. ఈ అప్పీల్ గురువారం మరోసారి విచారణకు రాగా... అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.... వివరాలు సమర్పించేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.