ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పునరుద్ధరించాలనే డిమాండ్ సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని అసోంలోని ప్రభుత్వ ఉద్యోగుల ఉమ్మడి ఫోరం నిర్ణయించింది. ఇక్కడ సోమవారం జరిగిన ఆల్ అస్సాం ప్రభుత్వ ఎన్‌పీఎస్ ఉద్యోగుల సంఘం (ఎఎజిఎన్‌పిఎస్‌ఇఎ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఓపీఎస్ అసోం జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ, ఓపీఎస్ అసోం జాయింట్ ఫోరం కూడా దీనికి మద్దతు తెలిపింది.
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)ను రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒపిఎస్ అమలు చేయాలనే డిమాండ్లతో తీర్మానాన్ని ఆమోదించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్ట్ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చట్టం 2013ను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టంలో ఎన్‌పిఎస్ క్లాజ్‌లను పొందుపరిచారని, చట్టాన్ని రద్దు చేయకుంటే ఓపీఎస్‌లోకి మారినప్పటికీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సమావేశం తెలిపింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించకపొతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని సమావేశం నిర్ణయించినట్లు ప్రకటనలో తెలిపారు.