రైతులకు 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ ప్రారంభించిన సబ్‌స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం అన్నారు. ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో 16 సబ్‌స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. రూ.3,100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైయస్ఆర్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్‌స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి.