టీడీపీకి పల్నాడు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాచర్ల నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి గుడ్ బై చెప్పారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. చలమారెడ్డికి సీఎం వైఎస్ జగన్ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వనించారు. ఆయనతోపాటు టీడీపీ నేతలు కె.శ్రీనివాసరెడ్డి, కె.రామచంద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి, కె.షణ్ముక్రెడ్డి, వి.శంకర్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
ఈ చేరికల కార్యక్రమంలో ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. చలమారెడ్డి 2014 ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీలో ఉన్నాసరే టికెట్ దక్కలేదు.. ఆ తర్వాత పార్టీలో కొనసాగారు. అయితే జూలకంటి బ్రహ్మారెడ్డికి మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. అయితే చలమారెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా లేరు.. అనూహ్యంగా టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది.