ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలొచ్చాయి. ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారని 24 గంటల పాటూ డాక్టర్లు అబ్జర్వేషన్ అవసరమని చెప్పినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కంగారుపడాల్సిన పని లేదంటున్నారు. గుండెలో చిన్న బ్లాక్స్ ఉన్నాయని.. డాక్టర్లు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ స్టంట్ వేసే అవసరం ఉందా.. లేదా అన్నది క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఆయన హెల్త్ బులిటెన్ ఇవాళ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. మంత్రి తిరుపతి వెళ్తుండగా మంగళగిరి సమీపంలో ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారని సోమవారం రాత్రి ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనను మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారని చెప్పారు. దీంతో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు.. మంత్రి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.