గుంటూరు జిల్లాలో ఓ బ్యాంక్ ఉద్యోగి చేతివాటం బయటపడింది. బ్యాంకులో బంగారం నాణ్యత పరిశీలించే అప్రైజర్ రూ.కోట్లలో గోల్‌మాల్ చేశాడు. వెండి ఆభరణాలకు బంగారం పూత పూసి వాటిని పలువురి పేర్లతో బ్యాంకులో తాకట్టు పెట్టాడు. గుంటూరుకు చెందిన దమ్మాలపాటి హనుమంతరావు బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో బంగారం తనఖా పెట్టి రుణం తీసుకుని తిరిగి చెల్లించిన వారి పేర్లను సంపాదించాడు. ఇలా 50 మంది పేర్లతో బ్యాంకు అకౌంట్‌లో ఓపెన్ చేయించాడు.. నకిలీ బంగారం తాకట్టు పెట్టించి రుణాలు తీసుకునేవాడు. మొత్తం రుణంలో వారికి కొంత మొత్తం ఇచ్చేవాడు.. ఇలా 2021 నుంచి 2023 నవంబరు వరకు లోన్లు తీసుకున్నాడు.
బ్యాంకు నిబంధనల ప్రకారం.. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను అదే బ్యాంకు మరో శాఖకు చెందిన అప్రైజర్ మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేస్తాడు. ఈ క్రమంలో గొట్టిపాడుకు బ్రాంచికి చెందిన సూర్యప్రకాష్ రావు గోరంట్ల బ్రాంచిలో ఉన్న బంగారు ఆభరణాలను తనిఖీ చేసేవాడు. నిందితుడితో ఒప్పందం ఉండడంతో అన్నీ సక్రమంగా ఉన్నాయని నివేదిక ఇచ్చేవాడు. ఈ నెల 20న నిర్వహించిన బ్యాంకు ఇంటర్నల్ ఆడిట్‌లో ఆడిటర్ అనిల్ దేక్త ఆభరణాలు నకిలీవిగా గుర్తించారు. ఈ విషయాన్ని అదే రోజు రీజినల్ కార్యాలయం అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రుణాలు తీసుకున్న అకౌంట్‌లను తనిఖీ చేయించారు.
దాదాపు 50 పేర్లతో నకిలీ బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఇద్దరు అప్రైజర్లకు ఇందులో ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమంతరావు గోరంట్ల శాఖతోపాటుగా అదే బ్యాంకుకు చెందిన లక్ష్మీపురం, కొత్తపేట శాఖలకూ అప్రైజర్‌గా ఉన్నాడు. ఆ బ్రాంచ్‌లలో కూడా తనిఖీలు చేయాలని బ్యాంకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంకే ఏవైనా అక్రమాలు బయటకు వస్తాయా అనే అనుమానం మొదలైంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్‌ఫిర్యాదు మేరకు హనుమంతరావుపై సోమవారం కేసు నమోదు చేశామని నల్లపాడు పోలీసులు తెలిపారు.