ప్రజలను, దేశాన్ని రక్షించడానికి బీజేపీని అధికారం నుంచి తరిమి కొట్టాలని ‘కిసాన్ మజ్దూర్ మహాపడావ్’ పిలుపు నిచ్చింది. మోడీ సర్కార్ కార్మిక, రైతు, ప్రజా, దేశ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా మూడు రోజుల మహాపడావ్ విజయవంతమైంది. ఈ చారిత్రాత్మక మహాపడావ్‌ను విజయవంతం చేసినందుకు కార్మికులు, రైతులకు కార్మిక, రైతు సంఘాలు అభినందనలు తెలిపాయి. అనేక రాష్ట్రాల్లో ‘కిసాన్ మజ్దూర్ మహాపడావ్’ ప్రజా ఉద్యమంగా మారింది. రాజ్‌భవన్‌కు చేరుకుని ఆయా గవర్నర్‌లకు మెమోరాండం, చార్టర్ ఆఫ్ డిమాండ్‌లను సమర్పించడం తో మహాపడావ్ పోరాటం ముగిసింది.
రైతు, కార్మిక నేతలపై కేసులు నమోదు చేసి, ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, మూడు రోజుల పాటు మహాపడావ్‌ను విజయవంతం చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సెక్టోరల్ ఫెడరేషన్లు/సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్త వేదిక 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు విజయవంతంగా జరిగిన మహాపడవ్‌లో లక్షల మంది పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. అనేక మంది మేధావులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులు మహాపడవ్‌కు సంఘీభావం తెలిపారు. సీపీఐ(ఎం)తో పాటు వివిధ పార్టీలు కూడా మహాపడవ్‌కు మద్దతు ఇచ్చాయి. దీంతో మహాపడవ్ రాజకీయ ప్రాముఖ్యతను సూచిస్తుంది.
అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్, త్రిపురలోని అగర్తల, పాండిచ్చేరితో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధాని నగరాల్లో రాజ్ భవన్ (గవర్నర్ కార్యాలయం)ల ఎదుట మూడు రోజుల పాటు మహాపడావ్ నిర్విరామంగా జరిగింది. మూడు రోజులు ఆందోళనా కేంద్రాల వద్దే వంటావార్పు చేసుకొని, తాత్కాలిక గుడారాలు ఏర్పాటుచేసుకొని రాత్రుళ్ళు కూడా అక్కడే బసచేశారు.
స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ప్రకారం రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయించాలని, ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలల పాటు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలనీ, ఆందోళనలో అమరులైన రైతులకు పరిహారం ఇవ్వాలనీ, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ హత్యలు, హోంశాఖ సహాయ మంత్రి రాజీనామా, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయడం, కార్పొరేట్ దోపిడీకి ముగింపు, మంజూరైన పోస్టుల భర్తీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, పెరిగిన ధరలను ఉపసంహరించు కోవడం నిత్యావసర వస్తువులపై, నాణ్యమైన, ఉచిత విద్య, ఆరోగ్య సేవలు, నీరు, ప్రాథమిక పౌర సౌకర్యాలు మొదలైన డిమాండ్ల సాధనకు మహా పడావ్ జరిగింది.
ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏ వంటి ప్రభుత్వ సంస్థల సహాయంతో యూఏపీఏ, దేశద్రోహ చట్టం వంటి నీచమైన చట్టాలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించి నందుకు రచయితలు, మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష సభ్యులను టార్గెట్ చేస్తుందని విమర్శించింది. చారిత్రాత్మక రైతు పోరాటంపై వాస్తవాల ను ప్రచురించిన న్యూస్‌క్లిక్ మీడియా ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ మేనేజర్ అమిత్ చక్రవర్తిలను కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపిందని విమర్శించింది. ఇది భయానక వాతావరణాన్ని సృష్టించడం, ప్రజాస్వామ్య ప్రక్రియలను విధ్వంసం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. ప్రజల డిమాండ్లపై మరింత భారీ, ఐక్య పోరాటాలు చేస్తామని రైతు, కార్మిక సఘాలు హెచ్చరించాయి. మహాపడవ్ కార్యక్రమాలను సమీక్షించిన అనంతరం స్వతంత్రంగా, సమన్వయంతో తదుపరి దశ ఆందోళనలను నిర్ణయిస్తామని (కేంద్ర కార్మిక సంఘాలు) సీటీయూఎస్, ఎస్‌కేఎం నాయకులు తెలిపారు.