వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సజ్జలకు వ్యక్తిగత హోదాలో కోర్టు ఈ నోటీసులు పంపింది. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిల్ దాఖలైంది. పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసుపై న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే పిల్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. తమ పిల్‌కు విచారణ అర్హత ఉందని న్యాయవాదులు ఉమేష్, శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ సొమ్ముతో సీఎం జగన్ రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారని న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. ఈ కార్యక్రమానికి రూ.20 కోట్లు ప్రభుత్వ సొమ్ము కేటాయిస్తూ జీవో నెంబర్ 7 ఇచ్చారని కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పాల్గొనాలని సజ్జల అధికారికంగా చెప్పారని లాయర్స్ వివరించారు. ఈ ఉత్తర్వులు సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు.. పిల్‌పై ప్రతివాదులకు అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రూరల్ డెవలప్మెంట్, పురపాలక శాఖ, గ్రామ, వార్డ్ సచివాలయం ప్రిన్సిపల్ సెక్రెటరీలకు నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.