సీఎం జగన్ ఇసుక దోపిడీకి దళితులు బలవుతున్నారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక ర్యాంప్ బాట నీటి ట్యాంకర్‌తో తడుపుతూ డ్రైవర్ దుర్గారావు గోదావరిలో పడి చనిపోయారన్నారు. అసలు.. ఎవరు చెబితే ఆ ర్యాంప్ తడపడానికి వచ్చి అతను ప్రాణాలు కోల్పోయాడో హోం మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అమాయకంగా మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. దుర్గారావు శవానికి దండేసి రూ.3 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని, రూ.5 లక్షలు ర్యాంపు యజమాని ఇస్తాడని హోంమంత్రి చెబుతున్నారన్నారు. ఇసుక తవ్వకాలకు జేపీ వెంచర్స్ గడువు ముగిసిందని.. కొత్తగా టెండర్లు పిలిచే ప్రక్రియ పూర్తవలేదన్నారు. మరి ఆ ఇసుక ర్యాంప్ యజమాని ఎవరో తెలియాలన్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్‌లో మంత్రి తానేటి వనితకు, సీఎంకు వాటాలున్నాయని జవహర్ ఆరోపించారు.