యూపీలో దళితులకు రక్షణ కరువైంది. బీజేపీ పాలనలో పెత్తందారీ కులాలు రెచ్చిపోతున్నాయి. యోగి సర్కారు కఠినంగా వ్యవహరించకపోవటంతో దళితులపై దాడులు తీవ్రమవుతున్నాయి.దళితుడిపై పెత్తందార్లు దుశ్చర్యకు పాల్పడిన ఘటన యూపీలో మరొకటి చోటు చేసుకున్నది. బాధితుడితో బలవంతంగా మూత్రం తాగిం చారు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అంతటితో ఆగకుండా లైంగిక వేధింపుల అభియోగాల కింద సదరు దళిత బాలుడిపై తప్పుడు కేసు నమోదు చేయించారు. జౌన్‌పూర్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకున్నది.
బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 23న దళిత బాలుడిపై ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన తండ్రి, కొడుకులు, కొందరు ఇతర గుర్తు తెలియని వ్యక్తులు ఈ అమానుష ఘటనకు దిగారు. ఆ తర్వాతి రోజు బాధితుడి తండ్రి బ్రిజేశ్ గౌతమ్ ఫిర్యాదు మేరకు సుజంగంజ్ పోలీసు స్టేషన్‌లో నిందితులపై కేసు నమోదైంది. నిందితులు తన కొడుకుపై దాడి చేశారని తన ఫిర్యాదులో బ్రిజేష్ గౌతమ్ ఆరోపించాడు. నిందితులు తన కుమారుడిని కొట్టారనీ, కుల దూషణలతో దుర్భాషలాడా రనీ, గ్లాసులోని మూత్రాన్ని బలవంతంగా తాగించి, ఎడమ కనుబొమ్మను షేవ్ చేశారని గౌతమ్ ఆరోపించారు. దీంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.
అయితే, దీంతో ఆగ్రహించిన పెత్తందారీ కులస్థులు.. బాధితుడిపై తప్పుడు కేసు బనాయించారు. తమ కూతురు కాలేజీకి వెళ్తున్న సమయంలో దళిత బాలుడు(బాధితుడు) ఆమెపై అసభ్య పదజాలం ఉపయోగించి, వేధింపులకు గురి చేసేవాడనీ, అందుకే బాలుడిపై దాడికి దిగినట్టు నిందితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను బాధితుడి కుటుంబీకులు తోసిపుచ్చారు. తాము చేసిన పిర్యాదుకు కౌంటర్‌గానే వారు(నిందితులు) తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, దళితు బాలుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులైన పెత్తందారీ కులస్థులపై కఠిన చర్యలకు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.