రాష్ట్రంలో 8 జిల్లాల కలెక్టర్లు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా పని చేస్తున్నారు. రెండు మూడు నెలలు మాత్రమే వీరంతా తప్పించుకోగలరు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదు’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఏమైనా ఫిర్యాదును ఆధారాలతో చేసినా చెత్తబుట్ట లో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల అక్రమాలపై బుధవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలతో కూడిన బృందం ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుంటే త్వరలో రాష్ట్రానికి వచ్చే కేంద్ర ఎన్నికల బృందం దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేసింది. వైసీపీ కుట్రపూరితంగా, పథకం ప్రకా రం తొలగిస్తున్న అర్హుల ఓట్లు, నమోదు చేస్తున్న దొంగ ఓట్ల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని మీనాను టీడీపీ నేతలు కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు సీఎం జగన్, వైసీపీకి పూర్తిగా లొంగిపోయారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు వారిపై ఆధారాలతోసహా ఫిర్యాదు చేశాం. కింది స్థాయి అధికారులు, కొందరు కలెక్టర్లు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్నారని తెలియజేశాం. ఫాం-6-,7,8 సహా నకిలీ ఓట్ల తొలగింపు, ఇతర టీడీపీ దరఖాస్తులపై ఎలాంటి చర్యలు లేవు. అవన్నీ కలిపి దాదాపు రాష్ట్రం లో 11 లక్షల వరకుఉన్నాయి. వాటన్నింటి పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం’’ అని అచ్చెన్న తెలిపారు. తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వస్తున్నామని తెలుసుకున్న వైసీపీ నేతలు.. తమ కంటే ముందే సీఈవోను కలిసి టీడీపీపై ఫిర్యాదుచేశారని అచ్చెన్న మండిపడ్డారు. ‘‘ఉరవకొండ, చంద్రగిరి, పర్చూరు, విజయవాడ సెంట్రల్, రాప్తాడు, కాకినాడ సిటీ, గుంటూరు వెస్ట్, మచిలీపట్నం, గురజాల, మాచర్ల, విశాఖపట్నం దక్షిణం, తిరుపతి నియోజకవర్గాల్లో జరుగుతున్న ఓట్ల అవకతవకలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. నిబంధనలకు విరుద్ధంగా పని చేసినట్టు తేలితే కలెక్టర్లకు మెమోలు ఇస్తామని సీఈవో చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కోలా అనంతపురం జిల్లా కలెక్టర్ నిబంధనలు మారుస్తున్నారని పీఏసీ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్ల అక్రమాల గురించి తాము చెప్పగానే మీనా నివ్వెరపోయారన్నారు. ‘‘ఫాం-6 దరఖాస్తులను ఏఈఆర్‌వోలు పరిశీలించి.. స్థానిక బీఎల్‌వోలకు పంపించాలి. బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి దరఖాస్తుల్లోని నిజానిజాలు పరిశీలించి పూర్తి సమాచారాన్ని ఏఈఆర్‌వోలకు పంపిస్తే, వారు ఆ దరఖాస్తులను ఈఆర్‌వోలకు పంపిస్తారు. ఈఆర్‌వోలు ఓకే అంటే ఓటర్‌లిస్టులో కొత్త ఓటర్ల వివరాలు నమోదవుతాయి. కానీ ఉరవకొండ నియోజకవర్గంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. వైసీపీ నేతలు తమకు పంపిన ఫారం-6 దరఖాస్తుల్ని ఎమ్మార్వోలు నేరుగా ఈఆర్‌వోలకు పంపిస్తున్నారు. బీఎల్‌వోల వెరిఫికేషన్ లేకుండానే ఇదంతా జరిగిపోతోంది. ఈ పద్ధతుల్లో తహసీల్దార్లు.. దొంగ ఓట్లు నమోదు చేయడానికి మూడు రోజులు ఏకబిగిన రాత్రిళ్లు పని చేశారు. ఇదంతా ఎన్నికల కమిషన్‌కు చెబితే ఆయనే అవాక్కయ్యారు’’ అని పయ్యావుల తెలిపారు.