స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో దర్యాప్తును సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖ లు చేసిన పిల్‌పై విచారణను హైకోర్టు డిసెంబరు 13కు వాయిదా వేసింది. సరైన చిరునామాలు లేకపోవడంతో కోర్టు జారీచేసిన నోటీసులు ప్రతివాదుల్లో కొందరికి అందలేదని గుర్తుచేసింది. వ్యక్తిగతంగా నోటీసులు అందజేసేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తు లు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన పిల్‌ను విచారించిన కోర్టు, ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రాగా, ఉండవల్లి తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి స్పందించారు. ‘‘కోర్టు నోటీసులు అందుకున్న ప్రతివాదుల్లో ఒక్కరు మాత్రమే స్పందించారు. సరైన చిరునామా లేకపోవడం వల్ల నోటీసులు ప్రతివాదులకు చేరలేదు. వారి చిరునామాలు సీఐడీ వద్ద అందుబాటులో ఉన్నాయి. అందువల్ల నోటీసులు అందజేసే బాధ్యతను ఆ సంస్థకు అప్పగించాలి’’ అని కోరారు. అయితే, ఈ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ‘మీరు చేయాల్సిన పనిని సీఐడీకి ఎందుకు అప్పగించా’లని ప్రశ్నించింది. అలా అయితే పిటిషనరే వ్యక్తిగతంగా నోటీసులు అందజేసేందుకు అనుమతివ్వాలని ఉండవల్లి తరఫు న్యాయవాది అభ్యర్థించా రు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, నోటీసులు అందని ప్రతివాదులకు నోటీసులు అందజేసే బాధ్యతను పిటిషనర్‌కు అప్పజెప్పింది. ప్రభుత్వం నోటీసులు తీసుకున్న నేపథ్యంలో ఈలోపు కౌంటర్ దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునని ధర్మాసనం తెలిపింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందించారు. స్కిల్ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలియజేస్తూ అఫిడవిట్ వేస్తున్నామన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ..తాము ఎలాంటి కౌంటర్ దాఖలు చేయడంలేదని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున వకాల్తా దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.