అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్) ఎలైన్‌మెంట్ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదాపడింది. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరుగగా.. సీఐడీ తరఫున అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి స్పందిస్తూ... ఈ వ్యవహారంలో అడ్వకేట్ జనరల్(ఏజీ) వాదనలు వినిపిస్తారని.. విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదేశాలిచ్చారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైనింగ్‌తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, అవినీతి చోటు చేసుకుందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది మే 9న సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.