టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర గురువారం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలంలో 213వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాళ్ళరేవులో లోకేష్‌ను పలువురు నిరుద్యోగులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్‌కు కమీషన్లపై ఉన్న శ్రద్ధ పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై లేదన్నారు. చంద్రబాబు తెచ్చిన కంపెనీలను జే ట్యాక్స్ కోసం వేధించి తరిమేశారని మండిపడ్డారు. జే - గ్యాంగ్ పుణ్యమా అని లక్షలాది ఉద్యోగాలు కల్పించే ఫ్యాక్స్ కాన్, లులూ, అమర్ రాజా, జాకీ వంటి పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి పరారయ్యాయన్నారు. టీడీపీ హయాంలో పరిశ్రమల ద్వారా యువతకు 6 లక్షల ఉద్యోగాలు కల్పించిందని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాళ్లరేవులోని నిరుద్యోగ యువకులకు స్థానిక కంపెనీలతో మాట్లాడి ఉద్యోగాలిచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యువకులు ఉద్యోగాలు వచ్చేవరకు యువగళం నిధి కింద నెలకు రూ.3వేలు భృతి కల్పిస్తామన్నారు. చంద్రబాబు సారధ్యంలో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటుతో 20లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని లోకేష్ పేర్కొన్నారు.