వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే వైఎస్ రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ రాజారెడ్డి ఉన్నత చదువుల నిమిత్తం ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అక్కడ ప్రియా అట్లూరితో ఆయనకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ప్రియా, రాజా కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్ షర్మిల - అనిల్ కుమార్ దంపతుల కుమారుడు రాజారెడ్డి పెళ్లి వార్తల నేపథ్యంలో.. అమ్మాయి ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ప్రియా అట్లూరి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆమెకు యూఎస్ఏ పౌరసత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, చట్నీస్ సంస్థల అధినేత అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలే ప్రియా అట్లూరి అని తెలుస్తోంది. వీరిది కమ్మ సామాజిక వర్గం. వైఎస్ రాజా రెడ్డికి ప్రియాతో తొలిసారిగా చర్చిలో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. గత 4 ఏళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారని పలు వార్తా కథనాల్లో పేర్కొన్నారు. వీరి ప్రేమకు ఇటు వైఎస్ షర్మిల - అనిల్ కుమార్ దంపతులు, అటు ప్రియా అట్లూరి కుటుంబసభ్యులు అంగీకారం తెలిపినట్లు సమాచారం. వచ్చే ఏడాది మేలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ రాజా రెడ్డి - ప్రియా అట్లూరిది కులాంతర వివాహం అవుతుంది. వైఎస్ షర్మిలది కూడా కులాంతర వివాహమేనన్న సంగతి తెలిసిందే. ఆమె భర్త అనిల్ కుమార్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేశారు రాజా రెడ్డి. యూనివర్సిటీ నుంచి పట్టా కూడా అందుకున్నారు. ఈ కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల - అనిల్ కుమార్ దంపతులు అమెరికా వెళ్లిన సమయంలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇడుపులపాయలో వైఎస్ షర్మిల తనకున్న భూమిని కుమారుడు, కుమార్తె పేరున ఈ ఏడాది జైలైలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సమయంలోనూ వైఎస్ రాజారెడ్డి ఫోటోలు వైరల్ అయ్యాయి.