విజయవాడ కనకదుర్గమ్మను టీడీపీ అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ అధికారులు స్వాగత పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. అనంతరం సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించారు.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. చంద్రబాబు వెంట విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేతలు ఉన్నారు. కనకదుర్గమ్మ శక్తి స్వరూపిణి అని అన్నారు చంద్రబాబు. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే తొలుత దైవదర్శనాలు చేస్తున్నానన్నారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు చెప్పారు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో, ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానన్నారు. మరోవైపు చంద్రబాబు ఆదివారం సింహాచలం అప్పన్న దర్శనానికి వెళతారు. 3వ తేదీ ఉదయం 11 గంటలకు గన్నవరం నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారు. అయితే ఈ నెల 5న చంద్రబాబు శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకుంటారు. అంతేకాదు కడప దర్గా, విజయవాడ గుణదల మేరిమాతను కూడా దర్శించుకుంటారు. అంతేకాదు ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు.