ఏపీవైపు తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచౌంగ్ మంగళవారం తీవ్ర తుఫాన్‌గా బలపడనుంది. సోమవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాతావరణశాఖ కోస్తా, రాయలసీమ జిల్లాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. ఆదివారం నుంచి తీరంలో అలల తీవ్రత పెరిగింది.. తుఫాన్ ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలో శనివారం రాత్రి నుంచే మొదలైంది.
ఈ తుఫాన్ నెల్లూరుకు 380 కి.మీ., బాపట్లకు 490 కి.మీ., మచిలీపట్నానికి 500 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి సోమవారం తీవ్ర తుఫాన్‌గా మారనుంది. గంటకు 90-110 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముంది. సోమ, మంగళవారాల్లో రాయలసీమ, కోసాంధ్రల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, బుధవారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణకోస్తాలో సోమవారం ఉదయం నుంచి 80-100 కి.మీ. వేగంతో.. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు 90-110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. తుఫాన్ హెచ్చరికలతో పాఠశాలలకు స్థానిక సెలవులు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.
గత రెండు రోజులుగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, పడే అవకాశం ఉంది. రానున్న రెండు, మూడు రోజులపాటు, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. మిచౌంగ్ తుఫాన్ ముప్పు భయం వెంటాడు తోంది.
తుఫాన్ ప్రభావం సోమవారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఇంకా తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 4వ తేదీన కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. బుధవారం పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ పేర్కొంది. 5వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, ఈదురుగాలుల ప్రభావం చూపుతాయంటున్నారు. వరిపంట చేతికందే దశలో వర్షాలు కురిస్తే తమకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిపంటను కాపాడు కునే పనిలో నిమగ్నమయ్యారు. కొంతమంది యంత్రాలతో నూర్పులు చేపట్టి.. ధాన్యాన్ని భద్రపరిచారు. మరికొంతమంది వరికుప్పలపై పరదాలు కప్పారు.