మిచౌంగ్ తుఫాన్ కారణంగా పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన రెండు సర్వీసులు, ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. మంగళవారం తుఫాన్ కోస్తా ప్రాంతంలోనే తీరం దాటనుండటంతో మరికొన్ని సర్వీసులు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేయగా.. చాలా విమానాలను చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పటి వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించినట్లు తెలుస్తోంది. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విశాఖపట్నంతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. విద్యార్థుల రక్షణ దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు కూడా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని డీఈవోలను ఆదేశించారు.