మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తిరుమలపై కూడా కనిపిస్తోంది. గత మూడు రోజులుగా తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఏఎన్సీ కాటేజ్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం దగ్గర పెద్ద, పెద్ద చెట్లు నెలకొరిగాయి.. ఏఎన్సీలో 412 కాటేజ్ దగ్గర ఉన్న భారీ వృక్షం నేలకొరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.. దీంతో ఏఎన్సీ కాటేజ్ వైపు పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి.. వెంటనే ఘటనాస్థలంకు చేరుకునగన అటవీ శాఖ అధికారులు భారీ వృక్షంను తొలగించారు.
ఈ ప్రమాదంలో భక్తులు ఎవరూ కాటేజీ వద్ద లేక పోవడంతో పెనుప్రమాదం తప్పిందనే చెప్పాలి. తుఫాన్ కారణంగా తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.. పాపవినాశనం మార్గంలోని పలు ప్రదేశాల్లో చెట్లు కూలి పోవడంతో పాపవినాశనంకు భక్తుల అనుమతిని టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటుగా సందర్శనీయ ప్రదేశాలైన శ్రీపాదాలు, శిలాతోరణంకు భక్తుల అనుమతిని చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా కపిలతీర్థంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. భక్తుల భద్రత దృష్ట్యా కపిలతీర్థం పుష్కరిణి నీటిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల అనుమతిని నిలిపివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ భక్తుల్ని అనుమతిస్తామంటున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.