ఏపీపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఈదురు గాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వరదనీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోవడంతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది.
తిరుపతి జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో అత్యవసరం అయితే తప్ప మూడురోజుల పాటు ప్రజలు బయటికి రావొద్దని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలోనే సోమవారం జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. తిరుపతిలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. కాజ్‌వేలపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి, అంజూరు, సూరమాల, కంచనపల్లి, గుండిపేడు, కాళంగి, రంగయ్య గుంట, ఆదవరం పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో పంటపొలాల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని పవిత్ర నదిగా పిలవబడే స్వర్ణముఖి నదికి జలకళ సంతరించుకుంది. ఐదు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు స్వర్ణముఖి పరవళ్ళు తొక్కుతోంది. ప్రవాహం ఎక్కువ కావడంతో స్వర్ణముఖి చెక్ డ్యామ్ వద్ద వరద నీరు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. దీంతో చెంబేడు కాలువకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. వరద ఉద్ధృతికి ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. చెరువులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరదయ్యపాలెం చెరువుకు గండి పడే ప్రమాదం ఉండటంతో అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. తిరుమలలో కూడా తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చలితో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. .
నెల్లూరు జిల్లాలో కూడా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 13 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 250 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సుళ్లూరుపేటలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. ఇటు బాపట్ల, గుంటూరుతో పాటూ ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయి. బుధవారం వరకు వానలు తప్పవని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.