అన్నప్రసాదానికి చాలా ప్రాముఖ్యం ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు కచ్చితంగా వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భోజనం చేస్తారు. అయితే తాజాగా అన్న ప్రసాద సముదాయంలో భక్తులు నిరసనకు దిగారు. భక్తులకు వడ్డించిన అన్నం బాగోలేదంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అన్నం పెడతారా? అంటూ నిలదీశారు. అయితే ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయమని టీటీడీ సిబ్బంది భక్తులను కోరారు. ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సిబ్బంది భక్తులకు సర్దిచెప్పి పంపించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తిరుమలలో భక్తులకు వడ్డించిన అన్న ప్రసాదంలో నాణ్యత లోపంపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. కొందరు భక్తులు అన్నప్రసాదం బాగోలేదని చెప్పిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. బియ్యంలో నాణ్యత లోపంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నప్రసాదం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో మరో 700 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని.. ఆ భక్తులకులేని ఇబ్బంది మిగిలిన భక్తులకు ఎందుకు ఎదురైందో తెలియడంలేదన్నారు. ఇతర భక్తులను కొంత మంది భక్తులు రెచ్చగొట్టడం.. అక్కడ పని చేసే సిబ్బంది తాగుబోతులని ఆరోపించడం బాధాకరమన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
తిరుమలలో అన్నప్రసాద కేంద్రం అత్యున్నతమైన ప్రమాణాలతో నడుస్తుందన్నారు భూమన. అన్నప్రసాద కేంద్రంలో సోమవారం రాత్రి అన్నం ఉడకలేదని భక్తులు ఆందోళన చేశారన్నారు. అన్న ప్రసాద కేంద్రం లో అందరికి అనుకూలంగా ఆహారాన్నీ తయారు చేస్తారని..తిరుమల అన్నప్రసాద కేంద్రం భక్తులు చేసిన ఆరోపణలలో నిజం ఉంటే సరిదిద్దుతామన్నారు. దురుద్దేశంతో అన్నప్రసాద కేంద్రం పై ఆరోపణలు చెయ్యొద్దని.. అన్నప్రసాద కేంద్రంలో ఒకేసారి నాలుగు వేలమంది భోజనం చేస్తారన్నారు. వారిలో పదిమంది మాత్రమే అన్నం బాగాలేదని చెప్పడం పై ఆలోచించాలన్నారు.. ఒకవేళ అన్నప్రసాద కేంద్రం లో లోపాలు ఉంటే సరిదిద్దుతామమన్నారు భూమన కరుణాకర్ రెడ్డి
గతంలో కూడా ఓసారి అన్నప్రసాదం విషయంలో విమర్శలు వచ్చాయి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో.. వెంటనే టీటీడీ స్పందించింది. రాధామోహన్ దాస్ అనే భక్తుడు దురుద్దేశ పూర్వకంగా తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపారు. మళ్లీ చాలా రోజుల తర్వాత అన్నప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి విమర్శలు వచ్చయి.. టీటీడీ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది.