విజయవాడలోని లపు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. నిర్మలా కాన్వెంట్ , మొగల్రాజపురం, పంట కాలవ ,చుట్టుగుంట, కృష్ణలంక, భవానిపురం, బెంజి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. రోడ్లు నీట మునగడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం తీరం వెంబడి ఈదురు గాలులతో కూడిన వర్షం కొండపోతగా కురుస్తోంది. సోమవారం రాత్రి నుంచి దివిసీమ ప్రాంతంలోని మూడు మండలాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. నెల్లూరు-మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు మచిలీపట్నంలో 7వ నెంబరు ప్రమాద సూచిక ఎగరవేశారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర స్థితి ఎదురైనా ఎదుర్కునేందుకు వీలుగా పోలీస్ శాఖ పరంగా 1000 మంది సిబ్బందిని ఉంచారు. 37 మంది సభ్యులతో ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని అవనిగడ్డలో, 25 మంది సభ్యుల బృందాన్ని మచిలీపట్నంలో సిద్ధంగా ఉంచారు. గజ ఈతగాళ్లతో పాటు పోలీస్, మైరెన్ విభాగాల్లో ఈత బాగా వచ్చిన వారిని తీర ప్రాంత మండలాలకు పంపారు. గాలులతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తింటే సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌శాఖ తీర ప్రాంత మండలాల్లో వైర్‌లైస్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది.
మచిలీపట్నం, నాగాయలంక, మోపిదేవి, అవనిగడ్డ, బంటుమిల్లి, కోడూరు, కృత్తివెన్ను మండలాల్లో పీహెచ్‌సీల ఆధ్వర్యంలో 52 ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. తుఫాన్ దృష్ట్యా సముద్రతీర ప్రాంతాలకు, బీచ్‌ల వద్దకు ప్రవేశాన్ని నిషేధించారు. మంగినపూడి బీచ్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. అధిక నీటి ప్రవాహం ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు. వాగులు, నదులు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు
కలెక్టరేట్: 08672-252572, 252000
విద్యుత్తు సమస్యలపై
మచిలీపట్నం: 9440817572
ఉయ్యూరు: 9491054708
గుడివాడ: 9440817573
టోల్‌ఫ్రీˆ నెంబరు: 1912
పోలీసుల సేవలకు: 112, 1009491068906, 8332983792
ధాన్యం నిల్వకు గోదాములు అవసరమైతే: 7331154812
తుఫాన్ ప్రభావంతో సోమవారం తెల్లవారు ఝాము నుంచి కురుస్తున్న వర్షం, వీస్తున్న గాలులు రైతులకు తీవ్ర నష్టం కలుగజేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొస్తున్న సమయంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చాలా వరకు కోతకోసి పొలాల్లో పనలపై ఉన్న వరిపంట తడిసి నీళ్లలో నానుతుంది. మెషిన్‌తో కోత కోయించి రోడ్లపక్కన ఆరబెట్టిన ధాన్యం చాలావరకు మిల్లులకు తోలగా, లారీల్లో లోడు చేసేందుకు కూలీలు దొరకక మరికొంతమేర కుప్పలు చేసి, సంచుల్లోకి ఎత్తి వర్షానికి తడవకుండా పట్టాలు కప్పి రైతులు నానా తంటాలు పడుతున్నారు.