మిజోరాం శాసనసభ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మొత్తం 40 స్థానాలున్న మిజోరాంలో ఆ కూటమికి 27 సీట్లు దక్కాయి. ఇక, ఆ పార్టీ నుంచి రేడియో జాకీ 32 ఏళ్ల బారిల్ వన్నెహ్‌సాంగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో అత్యంత చిన్న వయస్కురాలైన మిజోరాం ఎమ్మెల్యేగా ఆమె రికార్డు సృష్టించారు. ఐజ్వాల్ సౌత్-3 నియోజకవర్గం నుంచి వన్నెహ్‌సాంగి 1,414 ఓట్ల మెజార్టీతో ఎంఎన్‌ఎఫ్ అభ్యర్థిపై విజయం సాధించారు. మొత్తం ముగ్గురు మహిళలు విజయం సాధించగా.. వారిలో వన్నెహ్ ఒకరు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయిన రేడీయో జాకీకి.. 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మిజోరాం ఫలితాల తర్వాత ఆమె లింగ సమానత్వం గురించి గట్టిగా మాట్లాడారు. మహిళలు తమ అభిరుచి అనుగుణంగా ముందుకెళ్లాలని సాంగి సూచించారు. ‘మనకు నచ్చినది, అభిరుచికి తగినది ఏదైనా చేయడం గురించి మన జెండర్ మనల్ని నిరోధించదని మహిళలందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను.. అది మనం మక్కువతో ఉన్నదాన్ని తీసుకోకుండా నిరోధించదు.. ఏ కమ్యూనిటీ లేదా సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా వారికి ఇదే నా సందేశం.. వాళ్లు ఏదైతేనే చేపట్టాలనుకుంటున్నారో వారు దాని కోసం మాత్రమే ముందుకెళ్లాలి’ అని తెలిపారు.
విజయంపై మాట్లాడుతూ.. ‘మార్పు కోసం ఓటు వేసిన ప్రజలకు నా గెలుపును అంకితం చేస్తున్నాను.. రంగాల వారీగా అభివృద్ధిని తీసుకురాగల పాలనా మార్పును ప్రజలు కోరుకున్నారు.. కాబట్టి, మాకు అనుకూలంగా ఓట్లు వేసిన ప్రజలందరికీ నేను ఈ విజయాన్ని ఆపాదిస్తాను.. వ్యక్తిగత ప్రయోజనాలు, బంధుప్రీతి, అవినీతికి దూరంగా ఉండి రాష్ట్ర అభివృద్ధి, అభివృద్ధి కోసం ఉమ్మడి సాధనలో అందరూ ముందుకు వచ్చి మాతో చేతులు కలపాలని నేను కోరుతున్నాను. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండండి’ అని ఆమె పిలుపునిచ్చారు.
ఇక, షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన వన్నెహ్‌సాంగి.. టీవీ ప్రజెంటర్‌గా కెరీర్ ప్రారంభించారు. రాజకీయాల్లోకి వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి పోటీచేశారు. ఐజ్వాల్ సిటీలో ఓ స్థానం నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. ఈ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. కాగా, మిజోరాం ఎన్నికల్లో పోటీ చేసిన 174 మంది అభ్యర్థుల్లో 16 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడంతో 18 స్థానాల్లో మహిళా అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డారు.