తన తల్లి మొబైల్‌లో ఉన్న ఓ యువతి ఫోటోను చూసి ప్రేమలో పడిపోయిన యువకుడు.. ఆమెనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఫోటోలో ఉన్న యువతిది మన దేశం కాదని, ఆమె విదేశీ అమ్మాయి అని తెలిసింది. అయినాసరే ఆమెనే ఇష్టపడిన అతడు... తన అభిప్రాయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశాడు. కొడుకు ఇష్టాన్ని కూడా గౌరవించిన ఆ తల్లిదండ్రులు.. అమ్మాయి కుటుంబంతో మాట్లాడారు. అందుకు వారు కూడా సమ్మతించడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కానీ, ఇంతలో కరోనా, వీసా సహా పలు ఆటంకాలు ఎదురవ్వడంతో ఐదేళ్ల పాటు నీరిక్షించాల్సి వచ్చింది. చివరకూ అన్ని ఆటంకాలను అధిగమించిన ఈ జంట.. వచ్చే ఏడాది ఒక్కటి కాబోతోంది. ఇక, తన కాబోయే భర్త కోసం యువతి సరిహద్దులను దాటి భారత్‌లో అడుగుపెట్టింది.
పాకిస్థాన్‌కు చెందిన యువతి మంగళవారం వాఘా - అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి చేరుకోగా.. కాబోయే అత్తింటివాళ్లు ఆమెకు బాజా భజంత్రీలతో ఘనస్వాగతం పలికింది. వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాకు చెందిన యువకుడు సమీర్‌ఖాన్ జర్మనీలో ఉన్నత చదువులు చదువుకున్నాడు. అక్కడ నుంచి ఐదేళ్ల కిందట 2018 మేలో భారత్‌కు వచ్చిన సమీర్.. తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్ ఫొటో చూసి ఇష్టపడ్డాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. కుటుంబసభ్యులు అంగీకరించినా.. వీరి పెళ్లికి కొన్ని అనుకోని అవాంతరాలు, ఆటంకాలు ఎదురయ్యాయి. జావెరియా భారత్‌కు వచ్చేందుకు రెండుసార్లు వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ఈ సమయంలో కోవిడ్-19 కష్టాలు వచ్చిపడ్డాయి. ఇలా అయిదేళ్లు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఇటీవల జావెరియాకు 45 రోజుల గడువుతో భారత్ వీసా మంజూరయ్యింది. దీంతో మంగళవారం అట్టారీ-వాఘా సరిహద్దుల నుంచి భారత్‌లోకి అడుగుపెట్టింది.
అక్కడ సమీర్ కుటుంబం ఘనస్వాగతం పలికి ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం అమృత్‌సర్ నుంచి కోల్‌కతాకు ఈ జంట విమానంలో చేరుకుంది. జావెరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే జనవరిలో ఇరువురి వివాహం జరగనుంది. జావెరియా మాట్లాడుతూ.. ‘నాకు 45 రోజుల వీసా మంజూరయ్యింది.. ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది.. ఇలా వచ్చానో లేదో చాలా ప్రేమను పొందాను.. మా వివాహం జనవరి మొదటి వారంలో జరుగుతుంది.. రెండుసార్లు వీసాకోసం ప్రయత్నించాను.. ఈసారి మాత్రం అదృష్టవశాత్తూ మంజూరయ్యింది.. హ్యాపీ ఎండింగ్.. హ్యాపీ బిగినింగ్.. ప్రతి ఒక్కళ్లూ సొంతంటికి రావడంతో ఆనందంగా ఉంటారు’ అని తెలిపింది. ఇక, తన తల్లి చాలా సంతోషంగా ఉందని సమీర్ అన్నారు. జనవరిలో జరగబోయే మా పెళ్లికి ఆఫ్రికా, స్పెయిన్, అమెరికా సహా పలు దేశాల నుంచి మిత్రులు వస్తున్నారని అన్నారు.