కేరళలోని పథనంతిట్టా జిల్లాలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గత నెల 16 నుంచి మండల-మకరవిళక్కు పూజలు కొనసాగుతున్నాయి. స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని.. తిరుమలలో అమలవుతోన్న క్యూ విధానాన్ని శబరిమలలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారులు ఆదివారం ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈ విధానం 4 గంటల పాటు అమలైంది. సాయంత్రం, రాత్రి వేళల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ భక్తుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విధానాన్ని అమలు చేయడానికి మరకూట్టం, సరంగుత్తి మధ్య మూడు క్యూ కాంప్లెక్స్‌లు ఉపయోగించారు. ఈ కాంప్లెక్స్‌ల వద్ద యాత్రికులను నియంత్రించిన తర్వాత.. సన్నిధానం నుంచి వచ్చిన పోలీసుల ఆదేశాల మేరకు వాటిని తెరించేందుకు షెడ్యూల్ నిర్ణయించారు. క్యూ విధానం విజయవంతమైందని, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు.
ఆదివారం వర్చువల్ క్యూ సౌకర్యం ద్వారా మొత్తం 85,000 మంది భక్తులు దర్శనం కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అంతకు ముందు మూడు రోజుల్లో రోజుకు 80,000 మందికి పైగా దర్శించుకున్నారు. నడపంథాల్ (స్వాములు సన్నిధానం చేరుకోవడానికి ఏర్పాటుచేసిన కారిడార్) నిరంతరం భక్తులతో నిండిపోయింది. సోమవారం దర్శనం కోసం మొత్తం 89,996 మంది, మంగళవారం 60,000 మంది తమ పేర్లను నమోదుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. స్పాట్ బుకింగ్స్ కోసం మరో 10,000 మంది యాత్రికులు వచ్చినందున సన్నిధానం భక్తతులతో రద్దీగా ఉందని భావిస్తున్నారు. ఆదివారం ఉదయం నిర్మాల్య దర్శనం కోసం క్యూ మరకూట్టం వరకు పొడిగించారు. స్వామి దర్శనం కోసం ఎనిమిది గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది.
కాగా, శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన సమయాన్ని కూడా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు పెంచింది. దర్శన సమయాన్ని అదనంగా 2 గంటలు పెంచి, మొత్తం 16 గంటల పాటు భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 3 గంటలకే సన్నిధానాన్ని తెరిచి సుప్రభాత సేవ, నెయ్యాభిషేకం అనంతరం దర్శనాలు ప్రారంభిస్తున్నారు. కలశాభిషేకం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు నిలిపివేస్తున్నారు. తిరిగి 4 గంటలకు దర్శనాలను ప్రారంభించి.. రాత్రి 11 గంటలకు వరకూ అనుమతిస్తున్నారు. హరివరాసనం అనంతరం ఆలయాన్ని మూసివేస్తున్నారు. మరోవైపు, రెండు నెలల పాటు సాగే మండల-మకరు విళక్కు సీజన్ జజనవరి 20 వరకూ కొనసాగనుంది. జనవరి 14న మకర జ్యోతి దర్శనం తర్వాత పడిపూజతో ఆలయాన్ని మూసివేస్తారు.