ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వ్యవహారశైలి గురించి ప్రపంచానికి కొత్తేం కాదు. కఠిన ఆంక్షలతో ప్రజలను నానారకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ కనీసం మానవత్వం లేకుండా రాక్షసుడిలా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి వ్యక్తి బహిరంగంగా కంటతడి పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కన్నీళ్లకు కారణం.. దేశంలో జననాల రేటు తగ్గిపోవడమేనట!. మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతూ కన్నీళ్లు కార్చారట. కొంతకాలంగా ఉత్తరకొరియాలో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. దీంతో దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. ‘జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యత. ఇందుకోసం మా ప్రభుత్వం అమ్మలతో కలిసి పనిచేయాలని కోరుకుంటోంది’ అని అన్నారు. జాతీయ శక్తిని బలోపేతం చేయడంలో తల్లుల పాత్రకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలలో నాకు ఇబ్బంది ఎదురైనప్పుడు నేను కూడా తల్లుల గురించి ఆలోచిస్తాను అని కిమ్ అన్నారు. ఈ సందర్భంగా తల్లులంతా మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన చెబుతూ కిమ్ కన్నీటిపర్యంతమయ్యారు. అధ్యక్షుడి ప్రసంగం వినగానే సభలో మహిళలు కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రసంగం మధ్యలో కిమ్ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం గణాంకాల ప్రకారం.. ఉత్తర కొరియాలో జననాల రేటు 1.8గా ఉంది. ఇటీవల దశాబ్దాల్లో దారుణంగా పడిపోయింది. అయితే, సంతానోత్పత్తి రేటు పొరుగు దేశాల కంటే మెరుగ్గా ఉంది. దక్షిణ కొరియా సంతానోత్పత్తి రేటు గత ఏడాది రికార్డు స్థాయిలో 0.78కి, జపాన్‌లో 1.26కి పడిపోయింది. దక్షిణ కొరియాలో తగ్గుతున్న జననాల రేటు శిశువైద్యుల కొరతకు కారణమైంది. అయితే ఒక నగరం జనన రేటును పెంచడానికి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉత్తర కొరియా జనాభా 2.5 కోట్లు కాగా.. ఇటీవల కొన్నేళ్లుగా ఆ దేశం ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతోంది. 1990లలో ఘోరమైన కరువు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది.
దీనికి తోడు కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కిమ్ తమ సరిహద్దులను మూసివేశారు. ప్రపంచంతో ఆ దేశానికి దాదాపు సంబంధాలు తెగిపోయాయి. దీంతో వ్యాపార, వాణిజ్యాలు స్తంభించి ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. జనం తినడానికి తిండి, కనీస అవసరాలు తీరక పేదరికంతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇలాంటి తరుణంల ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తల్లులకు కిమ్ సూచించడం గమనార్హం. కాగా, కిమ్ ఏలుబడిలో కఠిన శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న కారణాలతోనే మరణ శిక్షలు విధిస్తుంటారు. గతంలో దక్షిణ కొరియాకు చెందిన వీడియోలు చూశాడని ఓ వ్యక్తిని బహిరంగంగా ఉరేశారు. అలాగే, కిమ్ ఆదేశాలను ధిక్కరించినవారు పత్తాలేకుండా పోయిన ఘటనలు ఉన్నాయి.