మిచౌంగ్ తుఫాను వదిలినా.. ఆకలి భూతం మాత్రం పీడిస్తోంది చెన్నై నగరాన్ని. అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నారు చెన్నై జనం. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా..అక్కడి ఆకలి కేకలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. మిచౌంగ్ తుఫానుతో అతలాకుతలమైంది చెన్నై నగరం. ప్రాణనష్టంతో పాటు విపరీతంగా ఆస్తి నష్టం జరిగింది. చెన్నైతో పాటు, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. గూడు కోల్పోయిన పేదలు.. కట్టు గుడ్డలతో బైటపడి అన్నపానీయాల కోసం అలమటిస్తున్నారు. నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిండా మునిగింది చెన్నపట్నం. చుట్టుపక్కల జిల్లాలు కూడా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి, రోడ్లపై మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తర్వాత చాలా ప్రాంతాలు వర్షాల నుంచి ఉపశమనాన్ని పొందినా.. సహాయక చర్యల్లో వైఫల్యం కనిపిస్తోంది.
చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్ వరద ప్రాంతాలను సందర్శించి, బాధితులకు సహాయక సామగ్రి పంపిణీ చేశారు. మరికొందరు స్వచ్ఛందంగా పాలు, ఆహారపొట్లాలు అందిస్తున్నారు. ఐనా… వర్ష పీడితుల ఆకలి బాధ తీరలేదు. మొత్తంగా చెన్నై నగరవాసులకు నరకాన్ని చూపింది మిచౌంగ్ తుఫాను. మరోవైపు మంగళవారం సాయంత్రం వరకు వర్షాలు తగ్గడంతో చెన్నై విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.