తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ.. పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కేటీఆర్‌కు ఫోన్ చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శైతం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, తగిలిన గాయం త్వరగా మానాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. మరోవైపు గాయం నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గాయమైందని తెలిసి చాలా బాధపడ్డానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆయన.. ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం తనకుందని పవన్ అన్నారు, పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం వాకబు చేశారు. మాజీమంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి యశోదా ఆస్పత్రికి వచ్చి కేసీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
శుక్రవారం తెల్లవారుజామున గజ్వేల్ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు. బాత్రూమ్‌లో కాలుజారి కిందపడిపోయారు. దీంతో తుంటిఎముకకు గాయం కాగా.. శుక్రవారం సాయంత్రం యశోద ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ నిర్వహించారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా రంగాలకు అతీతంగా ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.