మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.493.60 కోట్లు, తమిళనాడుకు రూ.450 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. తుఫాన్ ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లపై ఎక్కువగా ఉందన్నారు అమిత్ షా. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. అందువల్ల ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద కేంద్ర వాటా నిధులను ముందుగా విడుదల చేయాలని ప్రధాని ఆదేశించారన్నార. ఈ మేరకు..అమిత్ షా ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
'తీవ్ర మిచౌంగ్ తుఫాన్ యొక్క ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లపై ఎక్కువగా ఉంది. అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అనేక రంగాల్లో నష్టం తీవ్రంగా ఉన్నప్పటికీ కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు ఈ తుఫాన్ ఎక్కువ నష్టం కలుగజేసింది. తుఫాను కారణంగా అవసరమైన సహాయ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ విడత SDRF యొక్క కేంద్ర వాటాగా రూ. 493.60 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు, తమిళనాడుకు 450 కోట్లు ముందస్తుగా విడుదల చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)ని ఆదేశించారు. కేంద్రం ఇప్పటికే రెండు రాష్ట్రాలకు అదే మొత్తంలో మొదటి విడత విడుదల చేసింది. వరద ప్రభావిత ప్రజలందరి శ్రేయస్సు, క్షేమం కొరకు నేను ప్రార్ధిస్తున్నాను. ఈ కీలకమైన సమయంలో మేము వారికి అండగా ఉంటాము. వీలైనంత త్వరగా పరిస్థితి సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నాము' అంటూ ట్వీట్ చేశారు.
రెండు రాష్ట్రాలకే ఇప్పటికే తొలి ఇన్‌స్టాల్మెంట్‌ను రిలీజ్ చేసినట్లు అమిత్ షా తెలిపారు.గడిచిన 8 ఏళ్లలో చెన్నైలో వరదలు రావడం ఇది మూడవసారని.. అధిక వర్షాల వల్ల మెట్రో నగరాల్లో ఆకస్మికంగా వరదలు వస్తున్నాయని అమిత్ షా అన్నారు. తుఫాన్ సమయంలో ఈ రూ.493.60 కోట్లు విడుదల చేయడం ప్రభుత్వానికి కొంత ఉపశమనం అని చెప్పాలి.