మిచౌంగ్ తుపానుతో పంటలను నష్టపోయిన రైతులు ఓ వైపు కన్నీళ్లు పెడుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరులో మిచౌంగ్ తుపానుతో నష్టపోయిన పంటపొలాలను పరిశీలించిన చంద్రబాబు.. రైతులతో ముచ్చటించారు. వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. వేమూరు నియోజకవర్గంలో 90 వేల ఎకరాల్లో పంట సాగుచేస్తే 90 శాతం మంది రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియడం లేదన్న చంద్రబాబు.. ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. హుద్‍హుద్ తుపాను సమయంలో విశాఖలో మకాం వేసి మరీ తాను పరిస్థితులు చక్కదిద్దినట్లు చెప్పారు.
చిన్నారులలో నమ్మకం మరియు భద్రతా భావం కలిగించడం ఎలా..!
వైసీపీ మంత్రులు సాధికార యాత్రల పేరుతో అటూ ఇటూ తిరుగుతున్నారన్న చంద్రబాబు.. వైసీపీ నేతల మాటలు కోటలు దాటుతాయి కానీ.. చేతలు గడపకూడా దాటవని ఎద్దేవా చేశారు. వైసీపీ చేతకాని పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల నుంచి పంట కాలువలు బాగుచెయ్యకుండా ప్రభుత్వం ఏం చేస్తోందన్న టీడీపీ అధినేత.. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే నేడు రైతులు నష్టపోయేవారా అని ప్రశ్నించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు తాను వస్తున్నానని తెలిసిన తర్వాతే.. సీఎం జగన్ బయటకి వచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్షం కంటే అధికార పక్షం మరింత బాధ్యాతాయుతంగా ఉండాలని సూచించారు. కానీ ముఖ్యమంత్రి బాధ్యతాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో వరికి నష్టపరిహారం హెక్టారుకు 20 వేలు అందిస్తే వైసీపీ ప్రభుత్వం దానిని 15 వేలకు తగ్గించిందని మండిపడ్డారు. సమర్థ ప్రభుత్వం లేకుంటే వ్యవస్థలు సరిగా పనిచేయవన్న టీడీపీ అధినేత.. విపత్తులు వచ్చినప్పుడే ప్రభుత్వ సమర్థత ఎలాంటిదో తెలుస్తోందని అన్నారు.
మరోవైపు రైతుల తరుఫున పలు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచిన టీడీపీ అధినేత.. తుపాను కారణంగా వరిపంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు 30 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆక్వారైతులకు 50 వేలు, అరటికి 40 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్న చంద్రబాబు.. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మూడు నెలల తర్వాత వచ్చే టీడీపీ- జనసేన ప్రభుత్వం వాటిని నెరవేరుస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.