టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ నెలలోనే 17న యువగళం విశాఖలో ముగియనుంది. తూర్పుగోదావరి తర్వాత విశాఖ జిల్లాలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరుతో కొన్ని ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి. లోకేష్ పాదయాత్రకు సహకరించను అంటూ అయ్యన్న వ్యాఖ్యలు చేసినట్లు.. కొందరు టీడీపీ కార్యకర్తల పేరుతో ట్వీట్‌లు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ స్పందించింది.. అవన్నీ ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు.
'వైసీపీ అధికారికంగా చేయిస్తున్న ఫేక్ పోస్టులు ఇవి. ఈసారి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు పై పెట్టిన ఫేక్ పోస్ట్ ఇది. ప్రజలారా... కార్యకర్తలారా వైసీపీ ఫేక్ పోస్టులను నమ్మకండి' అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. ఈ ఫేక్ ట్వీట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. గతంలో కూడా టీడీపీ పేరుతో కొన్ని ఫేక్ ప్రెస్‌నోట్‌లు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. 'లోకేష్‌కి నా మద్దతు ఇవ్వను, ఎలాగో గెలవని వాడిని నా మద్దతు ఇచ్చి నా నియోజకవర్గంలో నా పరువు తీసుకోలేను అంటున్న అయ్యన్నపాత్రుడు, వ్యంగ్యంగా వాక్యాలు విసురుతూ మన టీడీపీ పార్టీకి ద్రహం చేస్తున్న అయ్యన్నపాత్రుడు'అంటూ టీడీపీ కార్యకర్త పేరుతో ట్వీట్ వైరల్ అయ్యింది. 'లోకేష్ పాదయాత్రకు నా డబ్బు ఖర్చు పెట్టనుగాక పెట్టను అంటున్న అయ్యన్నపాత్రుడు.. సీనియర్ నేత అయ్యుండి మన టీడీపీ కోసం, లోకేష్ అన్న కోసం డబ్బు పెట్టడానికి వెనకాడుతున్నారు. ఇతని వల్ల మిగిలిన వారు కూడా మద్దతు ఇవ్వడం లేదు.. దీనిని త్వరగా మనం అరికట్టాలి'అంటూ మరో ట్వీట్ చేశారు. 'లోకేష్‌కి మద్దతు ఇవ్వడుకానీ పార్టీలో పదువులు కావాలంట వీడికి.. అయ్యన్నపాత్రుడు మన టీడీపీని మోసం చేస్తున్నాడు.. మీరు ఏమంటారు' అని మరో ట్వీట్ చేస్తూ అయ్యన్న పేరుతో టార్గెట్ చేశారు.