పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు బెడదను తట్టుకునే కొన్ని కొత్త వంగడాలను, పురుగు మందులను రూపొందించి వాటిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైయస్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన అనుబంధ ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు. పత్తి పంటను ఆశించే గులాబీ రంగు పురుగును అరికట్టడంలో పిబి నాట్ టెక్నాలజీ సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు కర్నూలు జిల్లాలోని జరిపిన ప్రయోగాలలో నిర్ధారణ అయిన నేపధ్యంలో ఈ పిబి నాట్ టెక్నాలజిని పత్తి రైతులకు పంపిణే చేసేందుకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ గులాబీ రంగు పురుగును నిర్మూలించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇస్తున్న ప్రదర్శనలు, సలహాలు, సూచనలు పాటిస్తున్నందు వలన గులాబీ రంగ పురుగు కారణంగా జరుగుతున్న పత్తి పంట నష్టాన్ని ప్రస్తుతం 10 శాతానికి తగ్గించగలిగినట్లు తెలిపారు. గులాబీ రంగు పురుగు కారణంగా 2017-18లో దేశవ్యాప్తంగా 30 శాతం పత్తి పంటకు నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ పురుగును నివారించేందుకు గత కొన్నేళ్ళుగా వ్యవసాయ శాస్త్రజ్ఞులు చేస్తున్న కృషితో పత్తి పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగినట్లు మంత్రి తెలిపారు. గులాబీ రంగు పురుగును అరికట్టేందుకు అనేక పురుగు మందులను సైతం రైతులకు అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి వివరించారు.