గేట్లకు గ్రీజ్ పెట్టలేని అసమర్ధ ముఖ్యమంత్రితో రాష్ట్రానికి క్రేజ్ పోతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వాటర్ మ్యానేజ్ మెంట్‌లో జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. రాష్ట్రంలో జల వనరుల ప్రాజెక్టుల నిర్వహణకు దిక్కెవరని ప్రశ్నించారు. కొత్త ప్రాజెక్టులు ఎటూ కట్టరని.. కనీసం ఉన్న ప్రాజెక్టులనైనా కాపాడుకోలేరా అని నిలదీశారు. సాక్షికి వేల కోట్ల ప్రకటనలని.. మరీ ప్రాజెక్టుల నిర్వహణ మాటేంటని అడిగారు. జగన్ రెడ్డి ఇసుక మాఫియాకి ఇంకెన్ని ప్రాజెక్టులు కొట్టుకుపోవాలని మండిపడ్డారు. ఎన్ని టీఎంసీలు వృధా కావాలి? ఎంత మంది ప్రజలు చనిపోవాలని నిలదీశారు. గుండ్లకమ్మలో మొన్న 3వ నెంబర్ గేటు, నేడు 2వ నెంబర్ గేటు మరి రేపు ఎన్నో గేటు అని ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టులా గుండ్లకమ్మ కొట్టుకుపోయే వరకు పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిచింతల, పింఛా ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతున్నా, చెరువులకు గండ్లు పడుతున్నా జగన్ రెడ్డి పట్టించుకోరా అంటూ దేవినేని ఉమా తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.