ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉల్లిగడ్డ రాజకీయం వేడెక్కింది. దీనిపై రెండు పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఏపీలో ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల కంటే క్యాన్సర్ గడ్డలే ప్రమాదమని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రధానమైన క్యాన్సర్ గడ్డగా పేర్కొన్న అంబటి రాంబాబు.. టీడీపీ జతకు ఇప్పుడు జనసేన క్యాన్సర్ గడ్డ వచ్చి చేరిందని సెటైర్లు వేశారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్న అంబటి రాంబాబు.. టీడీపీ, జనసేనది అపవిత్ర కలయికగా అభివర్ణించారు. తెలంగాణలో ఎందుకు కలిసి పోటీ చేయలేదో, ఏపీలో ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణలో ఎనిమిది చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట తప్ప మిగిలిన చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మిగిలిన చోట్ల బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదన్న అంబటి రాంబాబు.. పవన్ కళ్యా్ణ్ మీటింగ్‌లకు జనం వస్తారు కానీ ఓట్లు వేయరని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సంగతికి వస్తే.. జనసేనకు చంద్రబాబు ముష్టివేసినట్లు సీట్లు ఇస్తాడన్న అంబటి రాంబాబు.. జనసేనకు అభ్యర్థులు లేనిచోట టీడీపీనేతలే జనసేన కండువాలు కప్పుకుంటారని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ క్యాష్ ఎవరు ఇస్తే వారికే కాల్షీట్లు ఇస్తాడన్న మంత్రి.. టీడీపీ, జనసేనకు ఫెయిలైన ఫార్ములాగా అభివర్ణించారు. ఇదే సమయంలో మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల తీరును అంబటి రాంబాబు ఎండగట్టారు. ప్రభుత్వ ముందస్తు చర్యల కారణంగానే ప్రాణనష్టాన్ని నివారించగలిగామని అన్నారు. చంద్రబాబు దీనిని కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని విమర్శి్ంచారు.
సీఎం జగన్ చొక్కా నలగకుండా తుపాను బాధితులను పరామర్శించారనే విపక్షాల ఆరోపణలపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు
తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్తే బురదలో పొర్లాడాలా అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు లాగా షో చేయటం జగన్‌కు రాదన్న ఆయన .. గుండ్లకమ్మ ప్రాజెక్టు విషయంలోనూ టీడీపీ తీరును తప్పుబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అలసత్వం వల్లనే ఈ దుస్థితి వచ్చిందన్న మంత్రి..గుండ్లకమ్మ విషయంలో టీడీపీ చేసిన పాపాన్ని మేం మోయాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.