గత వారం రోజులుగా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుఫాన్.. తీరం దాటిన తర్వాత తెలంగాణ మీదుగా పయనించే క్రమంలో బలహీనపడి అల్పపీడనంగా మారిందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఏపీ వ్యా్ప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాన్ని, మన్యాన్ని దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. పొగమంచు కారణంగా ఉదయం 8 గంటల వరకు స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. రహదారిపై ఎదురెదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదు. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.