కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు కుటుంబం నిర్వహిస్తున్న డిస్టిలరీ కంపెనీలో ఆదాయపు పన్ను అధికారులు గత గురువారం నిర్వహించిన సోదాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడిన విషయం తెలిసిందే. గడచిన ఐదురోజులుగా 50 మంది బ్యాంకు అధికారులు 40 నగదు లెక్కింపు యంత్రాలతో ఆ నోట్ల కట్టలను లెక్కించారు. ఇప్పటివరకు రూ.353 కోట్ల లెక్క తేలిందని మీడియా కథనాలు వెల్లడించారు. అయితే, దేశంలో ఐటీ సోదాల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా, గతంలో నల్లధనంపై ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గతేడాది ఆగస్టు 12న ధీరజ్ అవినీతికి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తూ.. ‘పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా దేశంలో నల్లధనం, అవినీతిని చూస్తుంటే నా హృదయం ధ్రవించుకుపోతోంది.. అంత పెద్ద మొత్తంలో నల్లధనం ఒకరి దగ్గర ఎలా పోగుపడుతుందో నాకర్థం కావడం లేదు. ఈ దేశంలో అవినీతిని పారదోలేది కాంగ్రెస్ మాత్రమే’ అని పేర్కొన్నారు. ఆ పోస్ట్‌ను ప్రస్తుతం బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ రీట్వీట్ చేశారు. ‘ధీరజ్ ప్రసాద్ సాహుకు మంచి హాస్య చతురత ఉంది’ అని ఎద్దేవా చేశారు. ఒడిశాకు చెందిన బౌద్ధ డిస్టిలరీ కంపెనీ ఝార్ఖండ్, బెంగాల్‌లోనూ వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఐటీ దాడుల్లో వందల కోట్ల నగదు బయటపడటంతో కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో పార్లమెంట్ వెలుపల బీజేపీ ఎంపీలు నిరసన చేపట్టారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, అవినీతి ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసు లాంటివి. ధీరజ్ సాహు కంపెనీల్లో దొరికిన ఈ నల్లధనం ఎవరిది..? దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలి’ అని నిలదీశారు. భారీ మొత్తంలో నగదు బయటపడటంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఇండియా కూటమిపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక ఎంపీ ఇంటి నుంచి ఈ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు.
అవినీతి అనేది కాంగ్రెస్ స్వభావం కాబట్టి ఆ పార్టీ నిశ్శబ్దంగా ఉందంటే సరేగానీ.. జేడీయూ, ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ ఎందుకు మౌనం వహిస్తున్నాయని ఆయన నిలదీశారు. కాగా, బయటపడిన నోట్ల కట్టల లెక్కింపు దాదాపుగా పూర్తికావొచ్చిందని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది.వ్యాపారాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, నగదు, దాని మూలాన్ని ఎంపీ వివరించాలని కోరింది.