దొంగలు రూటుమారుస్తున్నారు. దొంగతనాలకు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆ విధంగా.. మోటార్ బైక్లను చోరీ చేస్తున్న ముఠాను పుత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు పదిలక్షల రూపాయలు విలువ చేసే 13 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పుత్తూరు పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరి మండలం తడుకుపేట గ్రామానికి చెందిన దేవేంద్ర (22), అదే గ్రామానికి చెందిన హరి (23), కీలపట్టు దళితవాడకు ఎం.నరేష్ బాబు(29), పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిగకు చెందిన మార్టిన్ (23), అదే గ్రామానికి చెందిన బాదూరు రేవంత్ కుమార్ (22) ముఠాగా ఏర్పడి పుత్తూరు, నారాయణవనం, నగరి, వడమాలపేట తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ వచ్చారు. ఆటోడ్రైవర్ అయిన నరేష్ బాబు.. తొలుత ఆటోలో వచ్చి చోరీకి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందుగా రెక్కీ నిర్వహిస్తాడు. బైక్ దొంగతనానికి వీలవుతుందా లేదా అనే ఒక అంచనాకు వస్తాడు. ఆ తర్వాత దేవంద్ర, మార్టిన్, రేవంత్ కుమార్ వాహనాన్ని దొంగతనం చేసేవారు..
అలా దొంగతనం చేసిన వాహనాలను హరి అనే వ్యక్తి ఇతరులకు విక్రయించేవారు. ఇన్నిరోజుల పాటు వీరి యవ్వారం సాఫీగానే సాగింది. ఏపీతో పాటు తమిళనాడులోనూ చేతివాటం ప్రదర్శించిన దొంగలు సుమారు 13 వాహనాలను చోరీ చేశారు. అయితే ఇటీవలే వీరి ప్లాన్ బెడిసికొట్టింది. బైక్ చోరీలు జరుగుతున్నాయంటూ ఎక్కువ సంఖ్యలో కేసులు రావటంతో పుత్తూరు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పుత్తూరు సీఐ లక్ష్మీనారాయణ నేతృత్వంలో వడమాలపేట ఎస్ఐ రామాంజనేయులు, పుత్తూరు ఎస్ఐ వెంకటమోహన్, క్రైం బ్రాంచ్ ఏఎస్ఐ రాజులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.
బైక్ చోరీలపై నిఘా ఉంచిన ఈ ప్రత్యేక బృందం తమకు అందిన సమాచారం ఆధారంగా సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో పుత్తూరు-నగరి రోడ్డులోని నందిమంగళం, మరాఠీ గేట్ వద్ద వాహనాల తనిఖీని చేపట్టింది. అదే సమయంలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి వెళ్తున్న వీరు పోలీసుల కంటబెడ్డారు. పోలీసులు తమ రీతిలో విచారిస్తే అసలు బాగోతం బయటపడింది.దీంతో నిందితుల వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 13 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ముఠాను అరెస్ట్ చేసిన బృందానికి నగదు రివార్డును అందించారు.