ఆర్టికల్ 370 అమలులో ఉన్నపుడు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. ఆర్టికల్ 370 రద్దు చేయకముందు దేశంలోని మిగితా రాష్ట్రాల కంటే జమ్మూ కాశ్మీర్‌కు కొన్ని ప్రత్యేకతలు ఉండేవి. అయితే భారత్‌లో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉండాలనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2019 లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణ జరిపిన కోర్టు.. తాజాగా ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధమేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
2019 ఆగస్టు 5న, భారత హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా రెండు ప్రాంతాలుగా విభజించారు. అయితే, జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేసిన తర్వాత ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ రద్దును సమర్థించేవాళ్లు ఉన్నారూ.. వ్యతిరేకించే వాళ్లూ కూడా ఉన్నారు. ఇదే విషయం గురించి పలు రాజకీయ పార్టీలు, పలువురు ప్రజలు ఆర్టికల్ 370 రద్దును ఎత్తిచూపుతూ.. అనేక అంశాలు, ప్రశ్నలను లేవనెత్తుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. అసలు ఈ ఆర్టికల్ 370 అంటే ఎమిటి? దానిని ఎందుకు తీసుకువచ్చారు? జమ్మూకాశ్మీర్, ఆర్టికల్ 370కి ఉన్న సంబంధమేంటి? రద్దు తర్వాత ఇంకా రచ్చ ఎందుకు కొనసాగుతోంది? అనే ఈ తరహా ప్రశ్నలు మీకు వచ్చే వుంటాయి. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. !
బ్రిటీష్ పాలన నుంచి 1947 లో భారత్ విముక్తి పొందిన తర్వాత దేశంలో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ క్రమంలోనే వాటన్నింటినీ భారత యూనియన్‌లో కలిపేందుకు అప్పటి భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్‌ను కూడా భారత్ యూనియన్‌లో కలపడానికి ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్‌ను పాలిస్తున్న రాజులు మహారాజా హరి సింగ్.. కొన్ని షరతులు విధించారు. ఇందులో భాగంగానే 3 అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్‌పై సంతకం చేశారు. అందులో మొదటిది విదేశీ వ్యవహారాలు రెండోది రక్షణ.. మూడోది కమ్యూనికేషన్స్. ఈ క్రమంలోనే 1948 మార్చిలో జమ్మూ కాశ్మీర్‌లో మహారాజా హరి సింగ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని నియమించారు. ఆ సమయంల షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జూలై 1949 లో షేక్ అబ్దుల్లాతోపాటు మరో ముగ్గురు భారత రాజ్యాంగ సభలో చేరి జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే విధంగా పలు అంశాలతో షేక్ అబ్దుల్లా రూపొందించిన ఆర్టికల్ 370 ని ఆమోదించారు. ఆ తర్వాత భారత్‌లో కలిసిన జమ్మూ కాశ్మీర్.. ఆర్టికల్ 370 కింద కొన్ని ప్రత్యేక అధికారాలతో కొనసాగింది.
ఆర్టికల్ 370 కింద నిబంధనలు ఏంటి?
ఆర్టికల్ 370 ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్ల విషయంలో మినహా జమ్మూ కాశ్మీర్‌లో దేశంలో అమలయ్యే చట్టాలను వర్తింపజేయడానికి పార్లమెంటుకు తప్పనిసరిగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఆమోదం అవసరం అవుతుంది. అంటే భారత పార్లమెంటు ఆమోదించిన ఏ చట్టమైనా జమ్మూ కాశ్మీర్‌లో అమలు చేయాలన్నా స్థానిక ప్రభుత్వం నుంచి ఆమోదం అవసరం ఉంటుంది. వీటితోపాటు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కొన్ని రక్షణలు కల్పించారు. భారత రాజ్యాంగంతో పాటు జమ్మూ కాశ్మీర్‌కు మరో ప్రత్యేక రాజ్యాంగం కూడా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ పౌరుల పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కుల చట్టం మిగిలిన భారత పౌరులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. ఈ ఆర్టికల్ 370 ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందినవారు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తిని కొనుగోలు చేయలేరు. ఇక జమ్మూ కాశ్మీర్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు.
ఆర్టికల్ 370 తో వివాదాలు ఎందుకు?
భారత్ పాక్ విడిపోయిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్‌ను సొంతం చేసుకోవాలని పాకిస్థాన్ అనేక ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఆర్టికల్ 370 అంగీకారం తర్వాత కొన్ని షరతులతో జమ్మూ కాశ్మీర్ భారత్‌లో విలీనం అయింది. ఆ తర్వాత నుంచి భారత్-పాక్‌ల మధ్య ఘర్షణ మరింత పెరిగింది. అయితే భారత్‌లో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగం అయినా.. భారత చట్టాలు అక్కడ అమలు కాకపోవడంతో చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దేశంలో ఉండే ప్రజలందరికీ ఒకే రకమైన హక్కులు, అధికారాలు ఉండాలనే వాదనలు తీవ్రంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 సహా ఇతర చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 అడ్డుగా ఉందని మరికొందరు వాదిస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దు.. దాని తర్వాతి పరిణామాలు ఏమిటి?
2018 సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము మళ్లీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటూ 2019 ఆగస్టు 5 వ తేదీన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లఢఖ్‌గా విభజించారు. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడం 2019 అక్టోబర్ 31 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
ఆర్టికల్ 370 రద్దుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత స్థానిక ప్రజలు, పార్టీల నుంచి మాత్రమే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాలు, రాజకీయ నాయకులు, మేధావుల నుంచి తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది స్వాగతించగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఎంతో మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టులో మొత్తం 23 పిటిషన్లు దాఖలు కాగా.. వాటన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి తాజాగా తీర్పును వెలువరించింది.