ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తరతరాలుగా కశ్మీరీలకైన గాయాలను నయం చేయాల్సిందే.. జస్టిస్ కౌల్ ప్రత్యేక తీర్పు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2023, 10:38 PM

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రత్యేక తీర్పు రాశారు. 1980వ దశకం నుంచి కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై నిష్పాక్షిక విచారణకు ఆయన పిలుపునిచ్చారు. ‘కనీసం 1980 నుంచి ప్రభుత్వ, ప్రభుత్వ సంబంధిత వ్యక్తుల మానవ హక్కుల ఉల్లంఘనలపై నిష్పాక్షిక దర్యాప్తునకు ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నేను సిఫార్సు చేస్తున్నాను.. సయోధ్య కోసం చర్యలను సిఫార్సు చేస్తున్నాను’ అని జస్టిస్ కౌల్ అన్నారు.


‘ఈ విషయంలో ముందుకెళ్లాలి.. గాయాలను నయం చేయాల్సిన అవసరం ఉంది.. తరతరాలుగా ప్రజలు వాటిని అనుభవించారు. గాయాలు నయం చేయడానికి మొదటి అడుగు ప్రభుత్వం, దానికి సంబంధించిన వ్యక్తుల మానవ ఉల్లంఘనల చర్యలను గుర్తించడం’ అని జస్టిస్ కౌల్ ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం క్రమంగా జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడమని పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఇతర రాష్ట్రాల కంటే నెమ్మదిగా జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి ఉద్దేశించింది.. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ పరిషత్ సిఫార్సు ఆవశ్యకతను, ఉద్దేశాన్ని అనవసరంగా మార్చే విధంగా చదవలేం.’ అని తెలిపారు. క్రమంగా ఏకీకరణ అవసరాన్ని జస్టిస్ కౌల్ అంగీకరిస్తూనే.. ఏర్పాటు చేసిన విధానాలను దాటవేయడానికి దొడ్డిదారిన సవరణల ఉపయోగం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 367లో వివరించిన విధంగా సవరణ కోసం నిర్దిష్ట పద్ధతిని సూచించినప్పుడు, దానిని తప్పనిసరిగా అనుసరించాలని ఆయన నొక్కి చెప్పారు.


‘367ను ఉపయోగించి ఆర్టికల్ 370 సవరణకు సంబంధించి, ఒక విధానాన్ని సూచించినప్పుడు, దానిని అనుసరించాలని నేను చెప్పాను. దొడ్డిదారిన సవరణలను అనుమతించదు’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్దిస్తూ తీర్పు వెలువరించింది. పార్లమెంట్ నిర్ణయంతో ఏకీభవించిన ధర్మాసనం.. గడుపులోగా అక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa