పార్వతీపురంలో దొంగలు రెచ్చిపోయారు. వైకేఎం కాలనీలో ఓ ఇంట్లో చొరబడి సినీ ఫక్కీలో దోచుకెళ్లారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. వైకేఎం కాలనీలో శంబాన ప్రసాద్, రాణి దం పతులు నివాసం ఉంటున్నారు. ప్రసాద్ వ్యాపార నిమిత్తం సోమవారం ఉదయం వేరే ఊరికి వెళ్లాడు. సోమవారం రాత్రి రాణి ఇంటికి తాళాలు వేసి నిద్రపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకొని ఇంటి దగ్గరకు వచ్చారు. కిటికీకి ఉన్న ఇనుప మెస్‌ను తొలగించారు. బయట నుంచే ఓ కర్రను కిటికీ గుండా లోపలకు పెట్టి టీ పాయ్పై ఉన్న తాళాలను తీశారు.
ఆ తాళాలతో ఇంటి తలుపులను తెరిచి లోపలకు వెళ్లారు. బెడ్ రూమ్‌లోకి వెళ్లి నిద్రలో ఉన్న రాణిని లేపి కత్తితో బెదిరించి బీరులో ఉన్న బంగారు ఆభరణాలు, రూ.65 వేల డబ్బులు, వెండిని దోచుకువెళ్లారు. దొంగలు ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో రాణి కేకలు పెట్టడంతో చుట్టు పక్కల వారు ఏమైందని వచ్చారు. దొంగల విషయం తెలుసుకుని వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులకు సమాచారం అందించారు.. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితరాలు నుంచి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.. దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ చోరి సినిమా స్టైల్లో ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు.. ఇప్పుడు ఏకంగా ఇంట్లోకి చొరబడి మనుషుల్ని బెదిరించి దోచేశారు.